ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలకు ఉచిత సివిల్స్ శిక్షణ
మంత్రి సత్య కుమార్ చొరవతో లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ శిక్షణ కార్యక్రమం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో ఢిల్లీకు చెందిన ప్రముఖ సివిల్స్ కోచింగ్ సంస్థ డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వారు ధర్మవరంలో అక్టోబర్ 20 న ఆదివారం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత సివిల్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్నో సంవత్సరాలుగా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుండి ఎంతోమంది సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించి, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గంలో కూడా డిగ్రీ పూర్తి చేసుకున్న యువతుల కోసం అన్ని వసతులతో కూడిన ఉచిత శిక్షణను అందించాలనే తపనతో లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వారిని సంప్రదించగా వారు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం ముందుకు రావడం జరిగిందన్నారు.ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబరు 20, ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆశావాహులకు సివిల్స్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు . అభ్యర్థులకు ఒక అర్హత పరీక్ష నిర్వహించి,అందులో ఎంపికైన వారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంస్థ అధినేత డాక్టర్ లక్ష్మయ్య పాల్గొంటారని తెలిపారు.ఈ శిక్షణ సంస్థలో చదివి ప్రస్తుతం కళ్యాణదుర్గం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వినూత్న కూడా హాజరవుతున్నారని తెలిపారు. కావున ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం ధర్మవరంలోని మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ సిబ్బంది మల్లికార్జున 7998256789 , నరేంద్ర 94904 42576 లను ఈ నంబర్లపై సంప్రదించాల్సిందిగా వారు కోరారు. (Story : ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళలకు ఉచిత సివిల్స్ శిక్షణ)