విశాఖలో మసాజ్ కేంద్రాల పై పోలీసులు దాడులు
న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం : నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆదేశాలతో నగర పరిధిలో గల స్పా/ మసాజ్ కేంద్రాలలో మాదక ద్రవ్యాలు , అక్రమ కార్యకలాపాలు , అక్రమ రవాణా, ఇతర అసాంఘిక చర్యలను విశాఖ నగరం లో పూర్తిగా నిర్వీర్యం చేయుటకు ప్రత్యేక దృష్టి సారిస్తూ మరోమారు గత రాత్రి తేదీ 30/09/2024 న నగర వ్యాప్తంగా గల స్పా/ మసాజ్ కేంద్రాలపై విస్తృత తనిఖీలు జరిపిన నగర పోలీసులు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రాత్రి 07:45 నుండి 21:30 మధ్య చేపట్టిన ఈ తనిఖీలలో నగర వ్యాప్తంగా జోన్ -01 మరియు జోన్-02 కలిపి ఉన్న మొత్తం 83 స్పా/ మసాజ్ కేంద్రాలలో 31 స్పా/ మసాజ్ కేంద్రాలు తెరచి ఉండి , మిగిలిన 52 స్పా/ మసాజ్ కేంద్రాలు మూసి ఉన్నవి.
ప్రధానముగా స్పా/ మసాజ్ కేంద్రాలలో వ్యభిచారం నిర్వహిస్తున్నా, లేబర్ లైసెన్స్, ఫైర్ NOC, ట్రేడ్ లైసెన్స్, GST, గదులకు తలుపులు, గడియలు ఉన్నదీ, లేనిదీ, ఇతర రాష్ట్ర లేదా దేశ సిబ్బంది పనిచేస్తున్నది, లేనిదీ , సందర్శకుల రికార్డులు నిర్వహిస్తున్నది, లేనిదీ, సీసీటీవీకెమెరాలు ఉన్నవీ లేనివీ , సీసీటీవీ కెమెరాల డేటా ఫుటేజ్ 15 నుండి 30 రోజులు భద్రపరుస్తున్నది,లేనిదీ తనిఖీ చేయడం జరిగినది.
సుమారు 200 మంది సిబ్బందితో నగరంలో గల స్పా/ మసాజ్ కేంద్రాలను ఏకకాలంలో విస్తృత తనిఖీలు జరిపిన నగర పోలీసులు కొన్ని స్పా/ మసాజ్ కేంద్రాలలో ఉల్లంఘనలను గుర్తించారు.
▫️02 స్పా/ మసాజ్ కేంద్రాలకు లేబర్ సర్టిఫికెట్ లేదు.
▫️25 స్పా/ మసాజ్ కేంద్రాలకు ఫైర్ NOC లేదు.
▫️10 స్పా/ మసాజ్ కేంద్రాలకు ట్రేడ్ లైసెన్స్ లేదు.
▫️18 స్పా/ మసాజ్ కేంద్రాలకు GST లేదు.
▫️01 స్పా/ మసాజ్ కేంద్రమునకు సీసీటీవీకెమెరాలు లేవు.
▫️02 స్పా/ మసాజ్ కేంద్రాలకు సీసీటీవీకెమెరాల ఫుటేజ్ లేదు.
▫️01 స్పా/ మసాజ్ కేంద్రములో 04గురు విదేశీ సిబ్బందిని గుర్తించారు.
▫️01 స్పా/ మసాజ్ కేంద్రములో పశ్చిమ బెంగాల్ సిబ్బందిని గుర్తించారు.
▫️03 స్పా/ మసాజ్ కేంద్రాలకు తలుపులు గడియలు ఉన్నట్లు గుర్తించారు.
జి.వి.ఎం.సి వారు జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ చాలా మంది గడువు ముగిసి ఉన్నవారిపై, ఎంత మంది పనిచేస్తున్నారో తెలుపుతూ ఇచ్చే లేబర్ సర్టిఫికెట్ ఉంటూ, పరిమితికి మించి పనివారు కల మసాజ్ కేంద్రాలపై, జి.ఎస్.టి సర్టిఫికెట్ లేకుండా స్పా కేంద్రాలను నిర్వహిస్తూ టాక్స్ ను కట్టకుండా వ్యాపారం చేస్తున్న వారిపై , అదే విధముగా స్పష్టమైన నిబంధనలను పాటించని స్పా/ మసాజ్ కేంద్రాలను గుర్తించి , నోటీసులు ఇవ్వడంతో పాటుగా ఆయా శాఖల సంబంధిత అధికారులకు సదరు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న స్పా/ మసాజ్ కేంద్రాలపై తదుపరి చర్యలు నిమిత్తం నివేదిక ఇవ్వడం జరిగినది.
నగర పరిధిలో ఇదివరకూ పలు మార్లు స్పా/ మసాజ్ కేంద్రాలపై కేంద్రాల పైన దాడులు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. నగరంలో గల స్పా/ మసాజ్ కేంద్రాల నిర్వాహకులకు, ప్రజలకు స్పా/ మసాజ్ కేంద్రాల వద్ద అమలు చేయల్సిన విధివిధానాల పై స్పష్టమైన నిబంధనలను తెలియపరచడం జరిగినది.
కావునా స్పా/ మసాజ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించిన లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, స్పా/ మసాజ్ కేంద్రాల నిర్వాహకులకు, ప్రజలకు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు తెలియజేస్తూ ప్రజలు అందరూ తాను ఇచ్చిన 7995095799 నంబరును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగినది. (Story : విశాఖలో మసాజ్ కేంద్రాల పై పోలీసులు దాడులు)