Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం

దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం

0

దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం

సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనమే లక్ష్యం

సమన్వయంతో దసరా ఉత్సవాల విజయవంతానికి కృషి

న్యూస్‌ తెలుగు/విజయవాడ : సామాన్య భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లుకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా.జీ.సృజన ఆదేశించారు. అక్టోబర్‌ 3 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌, నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌వీ.రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పగడ్బందీగా జరగాలన్నారు. ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగి పడకుండా ముందస్తు జాగ్రత్తతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు లక్ష మందికిపైగా, మూలా నక్షత్రం రోజు 2 నుండి 3 లక్షల వరకు యాత్రికులు వచ్చే అవకాశముందన్నారు. క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో త్రాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
సీపీ ఎస్‌వీ.రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాధి మంది అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుండి 3,500 మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి నిర్ణీత ప్రాంతం, సెక్టార్‌(రంగం)కి ఒక ప్రత్యేక అధికారి పరిశీలనలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. దుర్గా ఘాట్‌ సమీపంలోని కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతం కంటే మరింత మెరుగ్గా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వాహణకు యాత్రికుల సలహాలు సూచనలు పొందేందుకు ప్రత్యేక వైబ్‌ సైట్‌ రూపొందించాలన్నారు. వృద్ధులు, విభిన్నప్రతిభావంతులు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక టైమ్‌ స్లాట్‌లను కేటాయించి ఆయా సమయాల్లోనే దర్శనం కల్పించాలని సూచించారు.
ఆలయ ఈవో కేఎస్‌.రామరావు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో అమ్మవారు పది అవతారాల్లో దర్శనమివ్వనున్నారన్నారు. అక్టోబర్‌ 3వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, 4న శ్రీ గాయత్రీ దేవి, 5న అన్నపూర్ణ దేవి, 6న శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి, 7న శ్రీ మహాచండీ దేవి, 8న శ్రీ మహలక్ష్మి దేవి, 9న శ్రీ సరస్వతి దేవి(మూలా నక్షత్రం), 10న శ్రీ దుర్గాదేవి, 11న శ్రీ మహిషాశురమర్థినీ దేవి, 12న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి అలంకారంతో దర్శనమిస్తారన్నారు. అక్టోబర్‌ 9వ తేదీన అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ లేకుండా వచ్చే యాత్రికులకు రిసెప్షన్‌, టోల్‌గేట్‌, హోమ్‌ టర్నింగ్‌, పున్నమి ఘాట్‌, వీఎంసీ ఆఫీస్‌, కలెక్టర్‌ ఆఫీస్‌, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌, మోడల్‌ గెస్ట్‌ హౌస్‌, హెడ్‌ వాటర్‌ వర్క్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ల వద్ద్ద కరెంటు టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినాయకుడి గుడి నుండి టోల్‌గేట్‌ ద్వారా కొండపైన హోం టర్నింగ్‌ వరకు 3 క్యూ లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓం టర్నింగ్‌ వద్ద ఉచిత దర్శనం, వీఐపీ క్యూ లైన్లతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లు ఉంటాయని, యాత్రికులకు త్రాగునీరు అందించేందుకు వాటర్‌ ప్యాకెట్లు, వాటర్‌ బాటిల్స్‌ సరఫరా చేయనున్నామన్నారు. కనకదుర్గానగర్‌ వద్ద ప్రత్యేక ప్రసాదం కౌంటర్లుతో పాటు కొండపైన ఓం టర్నింగ్‌ వద్ద కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 25 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రధం సెంటర్‌, మున్సిపల్‌ఆఫీసు, సీతమ్మ వారి పాదాలు, కుమ్మరి పాలెం, పున్నమి ఘాట్‌ వద్ద ఉచిత చెప్పుల స్టాండ్‌లు ఏర్పాటు, యాత్రికులు స్నానమాచరించేందుకు సీతమ్మ వారి పాదాల వద్ద 500, పున్నమి ఘాటు వద్ద 100, భవాని ఘాట్‌ వద్ద 100 షవర్లు, 150 తాత్కాలిక మరుగుదొడ్లకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాత్రికులకు అమ్మవారి ఉచిత ప్రసాదం కింద పులిహోర, కట్టు పొంగలి, దద్దోజనం, సాంబారు అన్నం మహామండపం ఎదురు ఖాళీ ప్రదేశంలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, సూచనలు సలహాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు గౌతమి శాలి, ఎం.కృష్ణమూర్తి నాయుడు, అడిషనల్‌ డీసీపీలు జీ.రామకృష్ణ, ఎం.రాజరావు, డీఆర్‌వో శ్రీనివాసరావు, ఆర్‌డీవో భవాని శంకర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్మయి, దేవస్థానం ఈఈలు ఎల్‌.రమ, కోటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : దసరా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version