హ్యాట్సాఫ్ టు కలెక్టర్ః దుర్వినియోగమైన సొమ్ము వసూలు!
జి. యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయినా రూ.67.52 లక్షలు వసూలు
అధికారుల సమక్షంలో సెప్టెంబర్ 17 నుంచి చెల్లింపులు
– కలెక్టర్ పి ప్రశాంతి
న్యూస్‌తెలుగు/రాజమహేంద్రవరం : జి . యర్రంపాలెం బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచి లో దుర్వినియోగం అయిన సొమ్ము రూ.67.52 లక్షలను సెప్టెంబరు 17 నుంచి బ్రాంచి నందు చెల్లింపులు జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, జి. యర్రంపాలెం బ్రాంచ్ కు చెందిన వ్యాపార కరస్పాండెంట్ ముతాబత్తుల నానిబాబు ద్వారా కస్టమర్ లకు చెందిన డిపాజిట్‌లను దుర్వినియోగం చేయడం జరిగిందని గుర్తించడం జరిగిందన్నారు. సదరు మొత్తాన్ని సంబంధిత ఖాతా దారులకు చెల్లింపులు జరపవలసినదిగా బ్యాంకు అధికారులను ఆదేశించామన్నారు. ఆమేరకు సదరు మొత్తాన్ని తిరిగి ఖాతాదారులకు చెల్లింపులు జరపాలని బ్యాంకు నిర్ణయించి సెప్టెంబరు 17 మంగళవారం జి. యర్రంపాలెం బ్రాంచి నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ లో జమ చేయనున్నట్లు తెలిపారు. సదరు రూ. 67.52 లక్షలను M/s విజన్ ఇండియా టెక్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి వసూలు చేసి, 17.09.2024 (మంగళవారం) నుండి మా జి. యర్రంపాలెం బ్రాంచ్‌లోని బాధిత కస్టమర్‌లకు మొత్తాలను రీయింబర్స్ చేయనున్నట్లు బ్యాంకు అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
స్వయం సహాయ సంఘాల కు చెందిన 64 ఖాతాల చెందిన మొత్తం రికవరీ చెయ్యడం జరిగిందని తెలిపారు. గ్రామాల వారీగా గుర్తించిన వివరాలు పుణ్యక్షేత్రం కి చెందిన 15 ఖాతాలకు చెందిన రూ.26,69,000 , కొండగుంటూరు పాకలు కు చెందిన రెండు ఖాతాలకు రూ.81 వేలు , సంపత్ నగర్ కు చెందిన ఆరు గ్రూపుల ఖాతాలకు రూ.5,45,000 లు , జీ.. యర్రంపాలెం కు చెందిన 41 ఖాతాలకు రూ.34,11,757 లు వెరసి రూ.64,06,757 లు దుర్వినియోగం అయినట్లు గా గుర్తించడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి పథక సంచాలకులు ఎన్ వివి ఎస్ మూర్తి తెలిపారు. ఇప్పటికే సంబంధిత సమాచారం ఖాతాదారులకు తెలియ చెయ్యడం జరిగిందని తెలిపారు. డిఆర్డిఎ సమక్షంలో సదరు చెల్లింపుల ప్రక్రియను సజావుగా బ్యాంకు బ్రాంచి నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.