లావుని పట్టా భూములకు
పంట రుణాలు ఇవ్వాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో లావుని భూముల (అసైన్డ్ భూమి)కు పట్టాలు, పాస్ బుక్కులు ఉన్న రైతులందరికీ డిసిసిబి బ్యాంకులు పంట రుణాలు వెంటనే ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో మాట్లాడారు. లావుని పట్టా భూములు ఉన్న చాలామంది రైతులు గతంలో సింగిల్ విండోల ద్వారా పంట రుణాలు తీసుకోగా, ప్రభుత్వం ఇటీవల మాఫీ చేసిందన్నారు. మాఫీ అయిన రైతులకు మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. కానీ లావుని, అసైన్డ్ భూములకు సింగిల్ విండోలలో ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వడం లేదన్నారు. పానగల్, రాజనగరం, వనపర్తి సింగిల్ విండోలలో కూడా లావుని పట్టా భూములకు రుణాలు ఇవ్వడం లేదన్నారు.సింగిల్ విండో అధికారులను అడిగితే డి సి సి బి లు లావుని భూములకు రుణాలు ఇవ్వటం లేదని చెబుతున్నారని, ఇదెక్కడి విడ్డూరం అని ప్రశ్నించారు. సాధారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న సన్నకారు రైతులకే లావుని పట్టా భూములు ఉంటాయని, అలాంటి బడుగు వర్గాల రైతులకే రుణాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఒకపక్క కౌలు రైతులకు కూడా పంట రుణాలు, రైతు భరోసా ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం లావుని పట్టాలు కలిగి ఉన్న రైతులకు డి సి సిబి లలో రుణాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. లావుని పట్టాలు ఉన్న రైతులందరికీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వండిసిసిబి బ్యాంకులను ఆదేశించాలన్నారు. లేదంటే రైతులను సమీకరించి డిసిసిబిల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి జి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ,ఎత్తం మహేష్, లక్ష్మీనారాయణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. (Story : లావుని పట్టా భూములకు పంట రుణాలు ఇవ్వాలి : సిపిఐ)