ముంబయి నటి కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్
న్యూస్‌తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడిరది. ముంబయి సినీ నటి కాదంబరీ జత్వానీని తీవ్ర వేధింపులకు గురిచేసిన ఉదంతంపై ఈ ముగ్గురి మెడకు ఉచ్చుబిగుసుకుంది. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారుల్లో ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీలు ఉన్నారు. వీరి సస్పెన్షన్‌కు సంబంధించి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబయి నటి జత్వానీ వ్యవహారంతోపాటు వివిధ ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. ఇది అనూహ్యమే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నది.
నటి కాదంబరీ జత్వానీతో కొంతమంది వైసీపీ నాయకుల సంబంధాలపై నమోదైన ఓ కేసులో జత్వానీపై తప్పుడు కేసు బనాయించి, ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆరోపణలున్నాయి. అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీలు ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులని చెపుతున్నారు. మొదట్లో వీరిద్దరి మెడకు ఉచ్చుబిగుసుకోగా, ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆయనను కూడా సస్పెండ్ చేశారు. ఏకంగా ఐపీఎస్ అధికారులపైనే ఆరోపణలు రావడం ఒకింత పోలీసు వర్గాలకు అవమానంగా మారింది. అలాగే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుత విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు కేసు విచారణ ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబసభ్యులపైఐ నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు వరకూ అనేక విషయాల్లో తీవ్రమైన లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వైసీపీ నాయకులు నటి జత్వానీని కావాలనే ఇరికించారని, వేధించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో తప్పు ఆమె వైపు కూడా ఉందని, కాకపోతే పోలీసులు పూర్తిగా నాయకులకు వత్తాసు పలికి, కేసును అడ్డంపెట్టుకొని జత్వానీని వేధించారని గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను రూపొందించి డీజీపీకి అందజేసిన పిదప ఈ ముగ్గురు ఐపీఎస్‌లనూ సస్పెండ్ చేశారు. (Story: ముంబయి నటి కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్)