ఎపిఐఐసి స్థలాలపై కలెక్టర్ సమీక్ష
న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఎపిఐఐసి) కి జిల్లాలో కేటాయించిన స్థలాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువారం తన ఛాంబర్‌లో సమీక్షించారు. కొన్ని స్థలాల స్థితిగతులపై అటవీ, రెవెన్యూ, ఎపిఐఐసి అధికారులు సంయుక్త విచారణ చేసి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 17 స్థలాలను ఎపిఐఐసికి కేటాయించగా, ఒక్కో స్థలం స్థితిగతులపై సంబంధిత మండల తాశిల్దార్ ను కలెక్టర్ ఆరా తీశారు. బలిఘట్టం, రెల్లి, కంటకాపల్లి, చింతలపాలెం, కాటకాపల్లి, చీపురువలస, అర్ధన్నపాలెం, కందివలస, మరుపల్లి, ముషిడిపల్లి, బీమసింగి, అలమండ, అట్టాడ, తాటిపూడి స్థలాల పరిస్థితిపై సమీక్షించారు. రెల్లి వద్ద సుమారు 150 ఎకరాలను ఎపిఐఐసికి కేటాయించగా, వాటిలో ఆక్రమణలపై ఆరా తీశారు. కొత్తవలస అర్ధన్నపాలెం, చీపురువలస వద్ద ఎపిఐఐసికి కేటాయించిన స్థలాలపై రెవెన్యూ, అటవీ, ఎపిఐఐసి అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి, వారం రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించారు. కందివలస స్థలంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. మరుపల్లి స్థలానికి రూ.17కోట్లు, కాటకాపల్లి స్థలానికి రూ.27 కోట్లు ఎపిఐఐసి చెల్లించాల్సి ఉందని, ఈ మేరకు వారికి లేఖ రాయాలని సూచించారు. ముషిడిపల్లి, అలమండ స్థలాలను ఇవ్వడానికి అవకాశం లేకపోవడం వల్ల, ఈ మేరకు జాబితానుంచి వాటిని తొలగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, ఆర్‌డిఓ ఎంవి సూర్యకళ, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ఎం.మురళీమోహనరావు, తాశిల్దార్లు పాల్గొన్నారు. (Story : ఎపిఐఐసి స్థలాలపై కలెక్టర్ సమీక్ష)