తాగునీటిసమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం
ముదిగుబ్బ సిపిఐ నాయకులు.. చల్లా శ్రీనివాసులు.
న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా లోనే పెద్దదిగా పేరుగాంచిన ముదిగుబ్బ మండలంలో
గత నెల రోజులు నుంచి నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే త్వరలోనే శ్రీ సత్య సాయి జిల్లాలోని మండల కేంద్రమైన ముదిగుబ్బలో 500 మంది మహిళలతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తమకు బకాయిపడ్డ ఏడు నెలల జీతాలు చెల్లించాలనే డిమాండ్ తో గత మూడు వారాలుగా జిల్లావ్యాప్తంగా సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తుండడంతో జిల్లా అంతట తాగునీటి సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిందే , ఈ నేపథ్యంలో కార్మికులు తన జీతాలు చెల్లించాలని గత 20 రోజులుగా అధికారులనుప్రజా ప్రతినిధులను వేడుకుంటున్న ప్రయోజనం లేకుండా పోతోంది,
ఈ పరిస్థితిలో సత్యసాయి కార్మికులతో పాటు, ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు, కూడా నెలల తరబడి జీతాలు అందక వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులతో వినాయక చవితి పండుగ రోజు కూడా పస్తులు ఉండాల్సిన దుర్భర పరిస్థితి నెలకొందని సిపిఐ నాయకులు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు, దీంతో కార్మికులు గత్యంతరం లేక సమ్మె కొనసాగిస్తుండడంతో మండల వ్యాప్తంగా రోజురోజుకు నీటి సమస్య అధికమవుతూ ప్రజలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు, ఈ పరిస్థితుల్లో ప్రజలు అధిక ధరలు చెల్లించి తాగునీటిని
కొనాల్సిన దుస్థితి నెలకొందన్నారు , కాగా ఎన్నికల ముందు సత్యసాయి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని , తాగునీటి సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన నాయకులు నేడు పూర్తిగా ఆ సమస్యను విస్మరించడం బాధాకరమన్నారు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న కార్మికుల జీతాలు చెల్లించి తద్వారా తాగునీటి సరఫరాను పునరుద్ధరించడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు, కనుక ఇప్పటికైనా కార్మికుల జీతాలు చెల్లించి తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు మండల మహిళలలో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా చల్ల శ్రీనివాసులు ప్రభుత్వానికి తెలియజేశారు , (Story : తాగునీటిసమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం)