ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హెడ్మాస్టర్ శైలజ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలచార్యులు పాల్గొని ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని జరుపుకోవడానికి ఉన్న విశిష్టతను వారు తెలియజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ నుండి నేర్చుకోవాలన్న తపన మంచి భవిష్యత్తుకు బాట వేస్తుందన్నారు. తదుపరి రిటైర్డ్ హెచ్ఎం యజ్జన్న, రిటైర్డ్ అధ్యాపకులు రాధాకృష్ణ, టీచర్ రంగప్ప నాగభూషణమును ఘనంగా సత్కరించారు. అనంతరం సత్కార గ్రహీతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి జీవితాన్ని అలవర్చుకొని ఉపాధ్యాయులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి నాగేంద్ర తోపాటు పళ్లెం వేణుగోపాల్, గూడూరు మోహన్ దాస్, సాగా సురేష్, వెంకటేష్ కుమార్, చందా నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో; పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షులు జై సింహా కార్యదర్శి నాగభూషణలు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. తదుపరి ఏడు మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీతలుగా రిటైర్డ్ హెచ్ఎం నూర్జహాన్, స్థానిక హెచ్ఎం మేరీ వర కుమారి, లతా, కరుణ, శారద, పార్థసారథి, పెద్దారెడ్డి లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కొండయ్య పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.