విపత్తు నిర్వహణలో సమన్వయ లోపం వద్దు!
వరద పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే జీవీ జూమ్ సమావేశం
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశం
న్యూస్‌తెలుగు/వినుకొండ: కొన్నిరోజులుగా పడుతున్న భారీవర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలో విపత్తు నిర్వహణకు సంబంధించి ఎక్కడా సమన్వయలోపం అన్న మాట రాకూడదని అధికారులకు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుులు స్పష్టం చేశారు . ముఖ్యమైన విభాగాల అధికారులందరూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసా కల్పించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పలు ప్రాంతాలను ముంచేసిన భారీ వర్షాలు ఇంకా ఉండొచ్చన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వరద పరిస్థితులపై ఆయన జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో వరద ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటలపై వర్షాల ప్రభావం, రైతులకు సాయం అందించాల్సిన అవసరం ఉంటే ఆ వివరాలు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంతో కలసి పంటనష్టం అంచనాలను వేగంగా రూపొందించాలన్నారు. నీటమునిగిన పొలాలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ రాజ్ విభాగం తరఫున గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, రక్షిత మంచినీరు, ముంపునకు గురైన ప్రాంతాల్లో బ్లీచింగ్, అవసరమైన చర్యలు ఉంటే తీసుకోవాలన్నారు. అలానే ఆర్&బీ విభాగంతో సమన్వయం చేసుకుని రహదారులు ఎక్కడైనా గుంతలు, కోతకు గురైతే మరమ్మతులు చేయాలన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా ఎక్కడైనా ఇళ్లు కూలిపోవడం, దెబ్బతింటే పరిహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులకు సూచించారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే విషజ్వరాలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో వర్షాలూ జతకలవడంతో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తపడాలని వైద్యారోగ్యశాఖ విభాగానికి సూచించారు ఎమ్మెల్యే జీవీ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఔషధాలు అందుబాటులో ఉంచాలని. గ్రామాల్లో ఉండే ఆరోగ్య కార్యకర్తలను అప్రమత్తంగా ఉంచి ఎప్పటికప్పుడు గ్రామాల్లోని పరిస్థితిని సమీక్షిస్తుండాలన్నారు. అవసరమైన చోట గ్రామాల్లో వైద్య శిబిరాలు పెడితే మేలేమో చూడాలన్నారు. దోమల బెడద లేకుండా వినుకొండ పట్టణంలోని వార్డులతో పాటు గ్రామాల్లో ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ స్థానికంగా దెబ్బతిన్న నీటి వనరుల వివరాలు సేకరించాలని… చెరువులు తెగిపోవడం, కాల్వలకు గండ్లు పడటం లాంటివి ఉంటే వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాక కాల్వలు, చెరువులకు ఎందుకు గండ్లు పడ్డాయనే సమాచారం కూడా సేకరించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపోవడం, స్తంభాలు పడిపోవడం లాంటివి జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలి అని విద్యుత్‌శాఖ వారికి సూచించారు. వినుకొండ పట్టణ, గ్రామీణ సీఐలు, నూజండ్ల, శావల్యాపురం, ఈపూరు, బొల్లాపల్లి మండలాల ఎస్సైలతో చర్చించి సహాయ చర్యల్లో తోడుగా ఉండాలన్నారు. మరీ ముఖ్యంగా 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారని ఈ పరిస్థితుల్లో.. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించాలి.. ఆలస్యం చేయొద్దని అన్నివిభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలన్నారు. (Story: విపత్తు నిర్వహణలో సమన్వయ లోపం వద్దు!)