మళ్లీ వరద ముప్పు
పెరుగుతున్న గోదావరి
భద్రాచలం వద్ద 40 అడుగుల నీటి మట్టం
సెప్టెంబర్లోనూ 7 సార్లు వరదలు
న్యూస్ తెలుగు/భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి మళ్లీ పెరుగుతుండటంతో వరద ముప్పు పొంచి ఉంది. ఎగువ నుండి నీరు దిగువకు విడుదల కావడంతో గోదావరి వేగంగా పెరుగుతోంది. మంగళవారం కడపటి వార్తలు అందే సమయానికి భద్రాచలం వద్ద 40 అడుగు నీటి మట్టం నమోదైంది. ఇది క్రమేపీ పెరుగుతూ 50 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఐదవ తేది నుండి మరో కొన్ని రోజుల పాటు తుపాను హెచ్చరిక ఉండటంతో తీర ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా జూలై, ఆగస్టు మాసాల్లో గోదావరికి పెద్ద ఎత్తున వరదలు వస్తుంటాయి. భారీ వర్షాలు పడటంతో మన ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండటంతో క్రీం దికి నీటిని విడుదల చేస్తుంటారు. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులే కాకుండా తాలిపేరు ప్రాజెక్టు నీరు కూడా పెద్ద ఎత్తున గోదావరి నదిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం పరివాహన ప్రాంతం పెద్ద ఎత్తున వరదల భారిన పడుతుంటుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడమే కాకుండా అనేక మంది ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. గడిచిన రెండు మాసాల్లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతం అతలాకుతలమైంది. జాన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మొదటి ప్రమాదహెచ్చరికను దాటి గోదావరి నది అనేక సార్లు ప్రవహించింది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు తాలిపేరు సామర్థ్యానికి మించి వర్షపు నీరు చేరడంతో గేట్లు ఎత్తిన అధికారులు నీటిని గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు.
గడిచిన 72 గంటలలో
మహారాష్ట్రలోని నాందేడ్, లాతూర్,బీదర్, ఉస్మానాబాద్, పర్బాని, తెలంగాణ లోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జిగిత్యాల జిల్లాల్లో భారీ నుండి అతి భారం వర్షం కురిసింది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ప్రవహిస్తోంది. ప్రాజెక్టుకు చెందిన 40 గేట్లను ఎత్తిన అధికారులు 1 లక్ష 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్లో, అవుటాఫ్లో దాదాపు సమానంగానే ఉంది. ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు సైతం పొంగి గోదావరిలో కలస్తున్నాయి. ఛత్తీస్ఘడ్లో ఎడతెరిపిలేని వానలు పడుతుండటంతో తెలంగాణలోని చర్లలో గల తాలిపేరు ప్రాజెక్టు నిండుతోంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి రెండు రోడులుగా 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుల్లో నుండి నీరు దిగువకు విడుదల చేయడం, ఉపనదులు, వాగులు, వంకలు పొంగిపొర్లి గోదావరిలో కలుస్తుండటంతో వరద పెరిగే అవకాశం ఉంది.
సెప్టెంబర్లో గోదావరి
సెప్టెంబర్ నెల్లోనూ గోదావరి భయపెట్టింది. ఈ నెల్లో ఏడుసార్లు గోదావరికి వరదలు వచ్చాయి. తొలిసారిగా 1978 లో 54.2,1994 లో 58.6 1998 లో 38.3 అడుగులు, 2005 లో 54.95, 2011 లో 43.35, 2014 లో 56.1, 2019లో 51.2 అడుగుల వరద వచ్చింది. సెప్టెంబర్ మాసంలోనూ చివరి ప్రమాదహెచ్చరిక 53 అడుగులు దాటి 4 సార్లు, 2వ ప్రమాద హెచ్చరిక 48 అడుగులుదాటి 1సారి, 3వ ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి 1 సారి గోదావరి పొంగింది. ఇందిలా ఉండగా 1995 అక్టోబర్లో సైతం 57.6 1 అడుగుల వరద గోదావరి వచ్చింది. దీనిని బట్టి చూస్తే జూన్ నెల మొదలుకుని అక్టోబర్ మాసం వరకు గోదావరి పరివాహక ప్రాంతం వరద ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. (Story: మళ్లీ వరద ముప్పు)