ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఇ.వి.ఎం.ల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం :
ఎన్నికల సంఘం సి.ఇ.ఓ. ఆదేశాల మేరకు జిల్లాలో విజయనగరం పార్లమెంటు పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల చెకింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగష్టు 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజులపాటు నెల్లిమర్లలోని జిల్లా స్థాయి ఇ.వి.ఎం.ల గోడౌన్‌లో నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు బొత్స అప్పలనరసయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఇ.వి.ఎం.ల చెకింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన మీదట జిల్లాలోని విజయనగరం పార్లమెంటు పరిధిలోని గజపతినగరం, బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మూడు పోలింగ్ బూత్‌లకు చెందిన ఇ.వి.ఎం.లను చెకింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి పోలింగ్ కేంద్రం నెం.20లో చెకింగ్, రీవెరిఫికేషన్ కోరుతూ బొత్స అప్పలనరసయ్య అవసరమైన ఫీజు మొత్తం రూ.47,200 చెల్లించారని, నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నెం.14 పోలింగ్ కేంద్రం, బొబ్బిలి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని నెం.09 పోలింగ్ కేంద్రంలో ఇ.వి.ఎం.ల చెకింగ్, రీవెరిఫికేషన్ నిమిత్తం బెల్లాన చంద్రశేఖర్ ఒక్కో కేంద్రానికి రూ.47,200 వంతున చెల్లించారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల ఇ.వి.ఎం.ల తనిఖీ, రీవెరిఫికేషన్ నిమిత్తం ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలను పాటిస్తూ, దీనిపై ఇ.సి. జారీచేసిన నిబంధనలను( స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) అనుసరించి ఇ.వి.ఎం.ల తనిఖీ, రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 24వ తేదీన ముందుగా దరఖాస్తు చేసిన అభ్యర్దులు, వారి ఏజెంట్ల కు యీ ప్రక్రియకు సంబంధించి ఎస్.ఓ.పి.పై కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కలిగించామన్నారు.
అనంతరం 26వ తేదీన గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నెం.20 పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ నెల్లిమర్లలోని ఇ.వి.ఎం.ల గోడౌన్‌లో చేపట్టగా దరఖాస్తు చేసిన అభ్యర్ధి బొత్స అప్పలనరసయ్య తరపున బెల్లాన వంశీ ఏజెంట్‌గా హాజరై మాక్‌పోల్ లో పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్ధి ఏజెంట్ 1400 ఓట్లను నమోదు చేయడంతోపాటు, ఓటింగ్ అనంతరం వి.వి.పాట్ల లెక్కింపు చేపట్టగా ఇ.వి.ఎం.లో వచ్చిన ఫలితాన్ని పరిశీలించి వాటి పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేశారని, రాతపూర్వకంగా కూడా యీ విషయాన్ని తెలిపారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
27వ తేదీన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నెం.09 పోలింగ్ కేంద్రం తనిఖీ, రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టగా దరఖాస్తు చేసిన అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా హాజరైనట్టు తెలిపారు. తాను ఇ.వి.ఎం.ల మాక్ పోల్ కోసం కోరలేదని, ఇ.వి.ఎం.ల ఛార్జింగ్ పై తనకు సందేహాలు వున్నాయని వాటిని నివృత్తి చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే తాము ఇ.వి.ఎం. తనిఖీ ప్రక్రియను చేపట్టగలమని ఆయనకు తెలిపామన్నారు. మాక్ పోల్‌పై తమకు ఆసక్తి లేదంటూ దరఖాస్తు చేసిన అభ్యర్ధి రాతపూర్వకంగా తెలియజేసి అభ్యర్ధి నిష్క్రమించడంతో బొబ్బిలి అసెంబ్లీ పరిధిలోని ఇ.వి.ఎం.లో మాక్ పోల్ కొనసాగించలేకపోయామన్నారు.
28వ తేదీన నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెం.14 పోలింగ్ కేంద్రం ఇ.వి.ఎం.కు సంబంధించిన ప్రక్రియ చేపట్టగా అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ తరపున ఏజెంట్ గా బెల్లాన వంశీ హాజరైనట్టు తెలిపారు. ఇ.వి.ఎం.ల మాక్ పోల్ కోసం కోరలేదని, ఇ.వి.ఎం.ల ఛార్జింగ్ పై తనకు సందేహాలు వున్నాయని వాటిని నివృత్తి చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే తాము ఇ.వి.ఎం. తనిఖీ ప్రక్రియను చేపట్టగలమని ఆయనకు తెలిపామన్నారు. మాక్ పోల్‌పై తమకు ఆసక్తి లేదంటూ దరఖాస్తు చేసిన అభ్యర్ధి రాతపూర్వకంగా తెలియజేసి అభ్యర్ధి నిష్క్రమించడంతో నెల్లిమర్ల అసెంబ్లీ పరిధిలోని ఇ.వి.ఎం.లో మాక్ పోల్ కొనసాగించలేకపోయామన్నారు.
పై అంశాలను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సి.ఇ.ఓ.కు నివేదిక పంపించామని వెల్లడించారు. (Story : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఇ.వి.ఎం.ల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాం)