కాల్ గ్యాస్ డెలివరీ బాయ్స్ కి సమగ్ర సంక్షేమ చట్టం చేయాలి
ఎఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్
న్యూస్‌తెలుగు /విజయనగరం : వంట గ్యాస్ ను ఎండనక వాననక ఇంటింటికీ వెళ్ళి ఎత్తైన మేడ మెట్లు ఎక్కి వినియోగదారులకి వంట గ్యాస్ సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్స్ కి నేటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఎలాంటి సంక్షేమానికి నోచుకోలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా కాల్ గ్యాస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖలో జరగబోయే ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాల కరపత్రాల ప్రచార కార్యక్రమం నిర్వహించి అనంతరం బుగత అశోక్ మాట్లాడుతూ కరోనా లాంటి భయంకరమైన విపత్తులో సైతం డెలివరీ బాయ్స్ ఆరోగ్యాలను ఫణంగా పెట్టీ వినియోగదారులకి వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశారన్నారు. కరోనా సోకిన వాళ్ళ ఇళ్ళకి, క్వరంటెన్ లో ఉన్న వాళ్ళకి గ్యాస్ ను సరఫరా చేసి ఎందరో మంది డెలివరీ బాయ్స్ కరోనా బారిన పడ్డారని తెలిపారు. వాళ్ళకి ఆరోగ్యం సహకరించి కాళ్ళు మోకాళ్ళ చిప్పలు అరిగిపోయే వరకు ప్రజలకి వంట గ్యాస్ సరఫరా చేస్తున్న డెలివరీ బాయ్స్ కి ఎలాంటి భద్రతా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన టీడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంలో అయినా వంట గ్యాస్ డెలివరీ బాయ్స్ కి వారి కుటుంబాలకు భద్రత తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సమగ్ర చట్టం చేయాలని ఏఐటీయూసీ గా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 ,2 ,3 తేదీల్లో జరగబోయే ఎఐటియుసి జాతీయ సమితి సమావేశాల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 3 వ తేదీన జరగబోయే భారీ ర్యాలీ, బహిరంగ సభలో కూడా పాల్గొంటామన్నారు.ఈ కార్య్రమంలో కృష్ణా, పైడిరాజు, హనుమంతు, అచ్యుత్ రావు, మూర్తి మరియు డెలివరీ బాయ్స్ పాల్గొన్నారు. (Story : కాల్ గ్యాస్ డెలివరీ బాయ్స్ కి సమగ్ర సంక్షేమ చట్టం చేయాలి)