ప్రజలు ఇచ్చే సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాము
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ భూ హక్కుల రికార్డు ముసాయిదా చట్టం 2024 లో చేయాల్సిన మార్పు చేర్పుల పై ప్రజలు ఇచ్చే సలహాలు సూచనలు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐ.డి. ఒ.సి) సమావేశ మందిరంలో కొత్త (ఆర్. ఒ.ఆర్ బిల్లు – 2024) తెలంగాణ భూ హక్కుల రికార్డు ముసాయిదా చట్టం – 2024 పై సలహాలు సూచనలు చేసేందుకు న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భూహక్కుల రికార్డు ముసాయిదా చట్టం 2024 లో పొందుపరచిన అంశాలు ఎంటి, ధరణి పోర్టల్ లో ఉన్న అంశాలు ఎంటి, 2020 లో తెచ్చిన ధరణి చట్టాన్ని మార్చి కొత్తగా చట్టం చేయాల్సినవవసరం ఏమొచ్చింది అనే అంశాలను నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భువని సునీల్ కూలంకషంగా విడమరచి వివరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ సునీల్ మాట్లాడుతూ 1936 నుండి ఇప్పటి వరకు (6) భూ చట్టాలను తీసుకురావడం జరిగిందని, 2020 లో తెచ్చిన ధరణి చట్టం ద్వారా చాలా సమస్యలు వచ్చి పడ్డాయని అన్నారు. కొన్ని లక్షల ఎకరాల భూమి పార్ట్ బి లో చేరిపోయిందని, భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారుల వద్ద ఎలాంటి అధికారం లేకుండా పోయిందన్నారు. అన్ని సమస్యలకూ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందుకే ధరణి చట్టంలో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. 2024 చట్టం ద్వారా వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూమికి సైతం హక్కుల రికార్డు అందజేసే వీలు కల్పించిందన్నారు. (20) సెక్షన్ లలో రూపొందించిన కొత్త చట్టం పాత చట్టాల్లో ఉన్న మంచి విషయాలను ప్రాతిపదికగా చేసుకొని భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా చట్టం రూపొందించడం జరిగిందన్నారు.
సమస్యలు లేకుండా తమ భూమికి సంబంధించిన భూహక్కుల రికార్డు తయారు కావడం, అదేవిధంగా భూహక్కులు మారినప్పుడు సమస్యలు లేకుండా న్యాయబద్ధంగా రికార్డులు మారడం కొత్త చట్టంలో ప్రధాన అంశాలుగా తెలియజేశారు.
ధరణి సవరణకు సైతం ఈ చట్టంలో అవకాశం కల్పిస్తుందన్నారు. సెక్షన్ -4 ప్రకారం పార్ట్ బి లో ఉన్న వాటిని సైతం మార్పులు చేసుకోవచ్చని చెప్పారు. మ్యూటేశ్ విషయంలో 18 రకాలుగా భూ బదలాయింపు జరిగేందుకు అవకాశం ఉందని మ్యూటేశన్ సమయంలో రెవెన్యూ అధికారుల ద్వారా విచారణ చేసి గడువులోగా మ్యూటేశన్ చేయడం కొత్త చట్టంలో నిర్దేశించడం జరిగిందన్నారు. భూమి అమ్మకం కొనుగోలు సమయంలో ఏదైనా అన్యాయం జరుగుతుందని సదరు వ్యక్తి భావిస్తే మ్యూటేశన్ కాకుండా ఆపే అధికారం రెవెన్యూ అధికారులకు కల్పించడం జరిగిందన్నారు. సాదా బైనామాలను సైతం క్రమబద్ధీకరించేందుకు కొత్త చట్టంలో అవకాశం కలించడం జరిగిందన్నారు. రికార్డుల సవరణకు, చిన్న చిన్న తప్పులను సవరించుకునేందుకు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ అధికారులకు అప్పీల్ చేసుకునే సదుపాయం కొత్త చట్టంలో అవకాశం కల్పించిందన్నారు.
తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టంలో ఇంకా మెరుగైన విషయాలు చేర్చడానికి, అత్యధిక ప్రజలకు ఉపయోగపడే అంశాల పై సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా సదస్సుకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, రైతు సంఘాల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, రెవెన్యూ, ఉపాధ్యాయ ఉద్యోగులను రిటైర్డు ఉద్యోగులను కోరారు.
చాల మంది తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ ధరణి లో ఉన్న సమస్యలను గుర్తించి ప్రజలకు మేలు కలిగే విధంగా కొత్త భూహక్కుల చట్టం తీసుకురావడం జరుగుతుందన్నారు. సహజ సిద్ధమైన భూమి పై హక్కులను కల్పించేందుకు 1853లో అప్పటి నవాబు సాలార్జన్ సర్వే చేసి భూ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరెస్ట్ చేత సర్వే చేయించి చైనా సిల్క్ బట్ట పై నక్షా ముద్రించడం జరిగిందన్నారు. గ్రామాల్లో భూ రికార్డులను కాపాడటానికి అధికారి ఉండాలని సూచించారు త్వరలో కవులు రైతులకు న్యాయం చేయడానికి కవులు చట్టం రాబోతుందని తెలియజేశారు.
భూ రికార్డుల విషయంలో అధికారులు తప్పులు చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కొంత మంది స్వలాభం కోసం ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని, ధరణి వల్ల అన్నదమ్ముల మధ్య పంచాయతీలు ఏర్పడ్డాయని అన్నారు. ధరణి వల్ల దాదాపు 20 లక్షల పట్టా భూములు ప్రోహిబిటెడ్ జాబితాలో చేరాయని వాపోయారు. గ్రామాల్లో దేవాలయ భూముల చాలా ఉన్నాయని వాటికి సైతం భూ హక్కులు కల్పించే విధంగా చట్టంలో అవకాశం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి తిరిగి తీసుకోడానికి హైడ్రా కమిటీ జిల్లాలలో సైతం రాబోతుందన్నారు. కొత్త చట్టంలో ఏమైనా మార్పులు చేర్పులకు సలహాలు ఇస్తే ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని శాసనసభ్యులు తెలిపారు.
మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ధరణిలో చిన్న తప్పు జరిగితే సరి చేసుకోడానికి వీలు లేకుండేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం తీసుకువచ్చిన ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి తర్వాత చట్టం రూపొందిస్తుందన్నారు. మొన్న రైతుభరోసా, నేడు భూ హక్కుల చట్టం పై ప్రజల నుండి సలహాలు సూచనలు తీసుకుంటుందన్నారు. భూమి కలిగిన ప్రతి ఒక్కరూ తమ భూమి సంబంధించిన హక్కులు ఏ విధంగా పొందవచ్చు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే రైతులు మోసపోకుండా ఉంటారన్నారు. చట్టాన్ని మంచి కొరకు ఉపయోగించాలి తప్ప చెడు కొరకు ఉపయోగించవద్దని ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేస్తే శిక్షలు పడే విధంగా చట్టంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ చైర్ పర్సన్ పి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మదనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, సి. సెక్షన్ సుపరిన్డెంట్ కిషన్ నాయక్, ప్రజాప్రతినిధులు, బార్ కౌన్సిల్ సభ్యులు, సంఘాల నాయకులు, ఉపాద్యాయులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజలు ఇచ్చే సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాము)