జిల్లా అవసరాలకు తగినంత ఇసుక సిద్దం
అందుబాటులో సమారు 50,330 మెట్రిక్ టన్నులు
ఫిర్యాదులను 18004256014 కు తెలియజేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఇసుక తరలించే వాహనాలను రిజిష్టర్ చేసుకోవాలి
జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా అవసరాలకు తగినంతగా సుమారు 50,330 మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇసుక కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.
కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో జులై 8 నుంచి ఉచితంగా ఇసుక సరఫరా విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. కన్వేయన్స్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు రూ.605 చొప్పున వసూలు చేయాలని జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించే నాటికి బొబ్బిలి స్టాక్ పాయింట్లో సుమారు 72,000 మెట్రిక్ టన్నులు, కొత్తవలస స్టాక్ పాయింట్‌లో 12,000 టన్నులు, డెంకాడ స్టాక్ పాయింట్ వద్ద 9,000 టన్నుల ఇసుక స్టాకు ఉందన్నారు. ఇప్పటివరకు మూడు స్టాకు పాయింట్ల నుంచి సుమారు 43,704 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా పారదర్శకంగా సరఫరా చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం డెంకాడ, కొత్తవలస వద్ద ఇసుక లేదని, బొబ్బిలిలో మాత్రం సుమారు 50,330 మెట్రిక్ టన్నుల స్టాకు ఉందన్నారు. సెప్టెంబరు 30 వరకు జిల్లాలో సుమారు 50వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ఈ అంచనా ప్రకారం వచ్చే నెలాఖరు వరకు అవసరమైనంత ఇసుక ఇప్పటికే సిద్దంగా ఉందని వివరించారు. మరో వారం రోజుల్లో వంగర మండలం కొండచాకరాపల్లి వద్ద సువర్ణముఖిలో ఇసుక పూడికలను తొలగిస్తామని, ఇక్కడ లభించే సుమారు 75వేల మెట్రిక్ టన్నుల ఇసుకను డెంకాడ, కొత్తవలస స్టాక్‌పాయింట్లకు తరలిస్తామని వెళ్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాకు కూడా బొబ్బిలి నుంచే ఇసుకను సరఫరా చేస్తున్నామని తెలిపారు.
శుక్రవారం నుంచి మరింత కట్టుధిట్టంగా ఇసుకను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. దీని ప్రకారం ఇసుకను తరలించే వాహనాలను ముందుగానే తప్పనిసరిగా రిజిష్టర్ చేసుకోవాలని తెలిపారు. వాహనాలకు 8 కిలోమీటర్లు వరకు టన్నుకు రూ.355 చొప్పున, ఆ తరువాత 80 కిలోమీటర్లు వరకు టన్నుకు కిలోమీటరుకు రూ.7.05 పైసలు చొప్పున చెల్లించాలని నిర్ణయించిందని తెలిపారు. స్టాక్ పాయింట్లు ఉన్న మండలాల తాశిల్దార్ కార్యాలయం వద్ద ముందుగా ఇసుకను బుక్ చేసుకొని, రిజిష్టర్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుకను లోడ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి రోజుకు 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని, ఇతర జిల్లాలకు ఇవ్వడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఇసుక సరఫరాకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే, టోల్ ఫ్రీ నెంబరు 18004256014 కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ మాట్లాడుతూ, ఇసుక సరఫరా, రవాణాను ప్రభుత్వం మరింత కట్టుధిట్టం చేసిందన్నారు. ప్రతీ స్టాక్ పాయింట్ వద్దా శుక్రవారం నుంచి చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, వాహనాలను తనిఖీ చేస్తామని తెలిపారు. వాహనాల రిజిష్ట్రేషన్ స్లిప్, బుకింగ్ స్లిప్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఇవి లేకుండా ఇసుకను తరలించే వాహనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనధికారికంగా ఇసుకను తరలించినా, అధికంగా లోడుతో ప్రయాణించినా, అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి స్పష్టం చేశారు. విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, గనులు భూగర్భశాఖ డిడి సూర్యచంద్రరావు, డిప్యుటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మణికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : జిల్లా అవసరాలకు తగినంత ఇసుక సిద్దం)