డిఐపిఆర్ఓ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారివారి నూతన కార్యాలయాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువారం ప్రారంభించారు. ఇప్పటివరకు కలెక్టరేట్ మేడపై ఉన్న డిపిఆర్ఓ కార్యాలయం, క్రింది అంతస్థులోని పాత ట్రెజరీ కార్యాలయం వద్దకు మార్పు చేశారు. ఆధునీకరించిన ఈ భవనాలను జిల్లా కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డిఆర్ఓ ఎస్‌డి అనిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్ మాట్లాడుతూ, అన్ని వసతులతో అందరికీ అందుబాటులో, సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో, తమ కార్యాలయాన్ని మేడపైనుంచి క్రిందికి మార్చామని చెప్పారు. ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ కి, ఇతర అధికారులకు, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. చిరునామా మార్పును జిల్లా అధికారులు, పాత్రికేయులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు.