అక్కచెల్లెమ్మల సంక్షేమంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారు
రాఖీపౌర్ణమి సందర్భంగా జీవీకి రాఖీలు కట్టిన సోదరి బ్రహ్మకుమారీలు, తెలుగు మహిళలు
న్యూస్‌తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎవరు సాటిలేరు, రాలేన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఏ ఆడబిడ్డ అయినా జీవితాంతం సోదరులు అండగా ఉండాలని కోరుకుంటారని, ప్రతిఅడుగులో ఆ స్ఫూర్తి నిలబెడుతూ అక్కాచెల్లెళ్లందరికీ చంద్రబాబు పెద్దన్నగా ఉంటున్నారన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా సోమవారం వినుకొండలో బ్రహ్మకుమారీలు, తెలుగు మహిళలు జీవీ ఆంజనేయులుకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోదరీసోదరుల మధ్య ఆత్మీయత, అనురాగాలు ఇచ్చిపుచ్చుకునే పండగే రక్షాబంధన్ అని, సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, వారిని గౌరవించే తత్వాన్ని ఇంటి నుంచి అలవాటు చేసే గొప్ప సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని అన్నారు జీవీ. పేగుబంధం పంచుకుని పుట్టిన అక్కాచెల్లెళ్లకే కాదు.. మన జీవితంలో వివిధ సందర్భాల్లో ఎదురయ్యే ప్రతి సోదరికీ అండగా నిలవడం మన బాధ్యత అని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో, అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రభుత్వం లో అక్కాచెల్లెమ్మలకు ఎప్పుడూ అగ్రస్థానమే అందించామన్నారు. ఆడపడుచులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది, ఆస్తిలో హక్కు ఇచ్చింది అన్న నందమూరి తారకరామారావు అని గుర్తు చేసుకున్నారు జీవీ. నాటి నుంచి నేటీకి పార్టీలో, అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రభుత్వంలో సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ వస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏ అక్కాచెల్లెమ్మ పేదిరకంతో ఇబ్బంది పడకూడదనే నిరంతరం ఆలోచిస్తుంటారన్నారు. నాడు డ్వాక్రా సంఘాల నుంచి నేటి పీ-4 కాన్సెప్ట్ ద్వారా పేదరికం లేని సమాజం సాధించాలన్న లక్ష్యం వరకు అన్నీ అందుకు నిదర్శమన్నారు జీవీ. మరీ ముఖ్యంగా అయిదేళ్ల వైకాపా పాలనలో దారుణాలు చూసిన తర్వాత అక్కాచెల్లెమ్మలు ఎవరూ పిల్లల చదువులకు ఇబ్బందులు పడకూడదని తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రకటించారని, గత ప్రభుత్వంలా కాకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇవ్వబోతున్నామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి వంటి అనేక కార్యక్రమాలు ప్రకటించినట్లు తెలిపారు జీవీ. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి, రుణ సహాయం పెంచి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆకాంక్షగా తెలిపారు. ప్రతి అక్కాచెల్లెమ్మ ఆత్మగౌరవంతో సొంతింటిలో జీవించేలా చేయాలని 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తక్కువ ధరకే నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు, రేషన్ దుకాణాల్లోనే మరిన్ని వస్తువులు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇదే సమయంలో కోల్‌కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిందన్నారు ఎమ్మెల్యే జీవీ. ఇలాంటి ఉదంతాలు మున్ముందు జరగకుండా ఉండాలంటే ప్రతి ఇంటి నుంచి మార్పు మొదలుకావాలి.. స్త్రీలను ఎలా గౌరవించాలో కన్నవాళ్లు పిల్లలకు తెలియజెప్పాలని సూచించారు. అక్కాచెల్లెమ్మల అందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు కలకాలం లభించాలని ఈ రాఖీ పండుగ సందర్భంగా ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. (Story : అక్కచెల్లెమ్మల సంక్షేమంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారు)