భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో
‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు వరుస అప్డేట్లను ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ ని తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు 14న తిరిగి ప్రారంభించినట్టు తాజాగా చిత్ర బృందం
వెల్లడించింది. అలాగే ఈరోజు ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఒక భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ ప్రారంభించినట్టు ప్రకటించింది.
ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో సుమారు 400-500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే సమయంలో తాను అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మరికొద్ది రోజుల్లో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణలో పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది.
మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. త్వరలోనే ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’తో ప్రేక్షకులందరికీ ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు.
దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ చిత్రంపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు.
ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని
భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
(Story : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం)