భూముల రికార్డులను సరిచేస్తాం
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా
న్యూస్‌తెలుగు/విజయనగరం : క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూముల రికార్డుల్లో కొన్ని తేడాలను గుర్తించామని, వాటిని సరిచేయాలని ఆదేశాలు జారీ చేశామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా చెప్పారు. విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా, ఆయన కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. భూముల రికార్డులను పరిశీలించడానికి, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం పోలిపల్లి, బసవపాలెం గ్రామాలను సందర్శించామని, ఎఫ్‌సిఓ, పాత అంగల్, 22 ఏ జాబితాలను పరిశీలించామని చెప్పారు. కొన్ని రికార్డుల్లో, భూముల వర్గీకరణలో గుర్తించిన తేడాలను సరిచేయమని ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. జిల్లాలో సుమారు 5,700 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయడం జరిగిందని, దానిలో 191 ఎకరాలు వరకు రిజిష్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ జరిగిందా లేదా?, రిజిష్ట్రేషన్లు సక్రమంగా జరిగాయా? లేదా అన్నది కూడా పరిశీలించామని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి ప్రజలనుంచి సుమారు 80 వినతులను స్వీకరించామని, వాటన్నిటినీ పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని సిసోడియా తెలిపారు.
మీడియా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ పాల్గొన్నారు. (Story : భూముల రికార్డులను సరిచేస్తాం)