ఏఐఎస్ఎఫ్ ది పోరాటాలు, త్యాగాల చరిత్ర: జె. రమేష్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఏఐఎస్ఎఫ్ ది పోరాటాల, త్యాగాల చరిత్ర అని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ జే రమేష్, జిల్లా విద్యార్థి సంఘం మాజీ నాయకులు గోపాలకృష్ణ అన్నారు. వనపర్తి అంబేద్కర్ చౌక్ లో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1936 ఉత్తరప్రదేశ్ లక్నోలో ప్రేమ్ నారాయణ భార్గవ్,బభృద్దీన్ విద్యార్థి నేతలు దేశ విముక్తికి పోరాడే సంకల్పంతో ఏఐఎస్ఎఫ్ను ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఏర్పడిన తొలి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. మహమ్మద్ అలీ జిన్న అధ్యక్షతన జరిగిన ఏఐఎస్ఎఫ్ తొలి సభలో నెహ్రూ ప్రసంగించారని, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ సందేశాలు పంపారన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు ,సుఖదేవ్ లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఏఐఎస్ఎఫ్ పోరాడిందని పలువురు విద్యార్థి నాయకులు అమరులయ్యారన్నారు.విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో ఏఐఎస్ఎఫ్ జరిపిన పోరాటంలో 32 మంది విద్యార్థి నాయకులను కోల్పోయింది అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో వీరోచత పోరాటం చేసిందన్నారు. చదువుతూ పోరాడు-చదువుకై పోరాడు నినాదంతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల కోసం పనిచేస్తోందన్నారు. శాస్త్రీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, బిజెపి ప్రభుత్వం విద్యను కాషాయీకరించే కుట్ర చేస్తోందన్నారు.విద్యా హక్కు చట్టం అమలుకు పలు పోరాటాలు చేపట్టిందన్నారు. నాణ్యమైన శాస్త్రీయ విద్య, పేద విద్యార్థులకు హాస్టళ్లు, స్కాలర్షిప్లు, పలు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు యాజమాన్యాలతో ఎదుర్కొంటున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పాఠశాల, కళాశాలల భవనాలు, హాస్టల్ భవనాలు, ఉపాధ్యాయులు లెక్చరర్లు ల్యాబ్ లో కొరత ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థుల కోసం పనిచేస్తున్న ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థులు చేరి సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జే నరేష్, డివిజన్ కార్యదర్శి వంశీ, చంద్రశేఖర్, మహేష్, మోహన్, విష్ణు, అశోక్, రాము, రాంబాబు, శివ యాదవ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు