వర్షాల నుంచి నష్టపోకుండా చర్యలు చేపట్టాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజలు భారీ వర్షాలకు నష్టపోకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని సిపిఐ, సిపిఐ అనుబంధ ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి సిపిఐ ఆఫీస్ లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదు రోజులపాటు భారీ అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పలు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, కె ఎల్ ఐ, భీమా, జూరాల కాలువలు దెబ్బతినకుండా కాపాడాలి అన్నారు. మిషన్ భగీరథలో పనులు నాణ్యవంతంగా జరగలేదన్నారు. పానగల్ మండలం కేతేపల్లి లో 100 ఎకరాల ఆయకట్టు గల గుండ్ల చెరువు తూములు సరిగా లేవన్నారు. చెరువు, కుంటల కట్టలు, పంట, పాటు కాలువలు వెంటనే మరమ్మత్తు చేయాలన్నారు. ప్రాజెక్టుల కాలువల్లో జమ్ము, మట్టి పేరుకుపోయిందని, కాల్వల గట్లు దెబ్బతిన్నాయని, నీరు వదిలితే తెగిపోయే పరిస్థితి ఉందన్నారు. వర్షపు నీరు ప్రతి చుక్కను విడిచిపెట్టి తాగు నీటికి సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలామంది పేదలు ఇల్లు కట్టుకుని స్తోమత లేక శిథిలమైన ఇళ్లలోనే నివాసం ఉంటున్నారని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లుఇచ్చి నీడ కల్పించాలన్నారు. వర్షాలకు పారిశుద్ధ్యం పలు రకాల రకాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. వాటర్ క్లోరినేషన్, తాగునీటి పైపుల లీకేజీల మరమ్మత్తు చేయాలన్నారు. సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. (Story : వర్షాల నుంచి నష్టపోకుండా చర్యలు చేపట్టాలి : సిపిఐ)