బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తి. అయితే ఇప్పుడాయన అధినేత విస్మరించిన వ్యక్తుల్లో ఒకరిగా మిగిలారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న 25 మంది జాబితాలో బాలినేని లేరు. కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం కూడా సోమవారం ఉదయం విజయవంతంగా ముగిసింది. ఆఖరి నిమిషంలో బాలినేనిని చోటు దక్కుతుందేమోనని భావించినా, అది జరగలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసిన బాలినేని ఐదుసార్లు విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే నిలిచారు. పైగా జగన్‌కు అత్యంత సన్నిహిత బంధువు కూడా. జగన్ పిలిస్తే అందరికన్నా ముందుండే వ్యక్తుల్లో బాలినేని ఒకరు. ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీని అగ్రపథాన నడిపిస్తున్నది బాలినేనే. అయినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వద్దనుకున్న ఆదిమూలపు సురేష్‌కు ఆఖరి నిమిషంలో పదవి దక్కినా, తనను మాత్రం విస్మరించారు. బాలినేనిని పక్కనపెట్టడం వెనుక కారణాలు అంతుపట్టడం లేదు. క్యాబినెట్ హోదాలో ఇంకేపదవినైనా ఆయనకు కట్టబెట్టనున్నారా? వచ్చే రెండేళ్లలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సీఎంతోపాటు కీలకంగా పనిచేయాల్సిన ఒకరిద్దరు వ్యక్తుల్లో బాలినేనిని ఒకరిగా గుర్తించారా? ఇక నుంచి పార్టీని తిరిగి అధికారంలోకి తెప్పించేపనిలో ఉండటమే బాలినేని లాంటి వ్యక్తుల పనా? బాలినేనికి పదవి వుంటే ఎంత? లేకపోతే ఎంత? అవసరమనుకుంటే, సర్వం ఆయనగానే వుండవచ్చు అనే భావనలో సీఎం వున్నారా? సామాజిక కూర్పు చాలా ముఖ్యం కాబట్టి, తన వాళ్లందర్నీ సీఎం కావాలనే పక్కనబెట్టారా? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆరోపణలూ ఒక కారణమేనా?
బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గీయులపై వస్తున్న ఆరోపణలు కూడా ఆయనను సీఎం పక్కనబెట్టడానికి ఒక కారణమని కొన్ని పత్రికలు కథనాలు రాశాయి. బాలినేని వర్గీయుల పెత్తనం ప్రకాశం జిల్లాలో విపరీతంగా పెరిగిపోయిందని, అమరావతిలో సైతం వారి హవా ఎక్కువైందని, నెగిటివ్ సెన్స్ రాకముందే వారిని పక్కనబెట్టి, తగ్గించడం ఉత్తమమని సీఎం భావించారని ఆ కథనాలు పేర్కొన్నాయి. బాలినేని అనుచరులు జిల్లాలో రెవిన్యూ, విద్యుత్ శాఖలపై విపరీతమైన ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని, తమకు అనుకూలంగా పనిచేసేవారిని ఉంచడం, లేనివారిని బదిలీలు చేయించడం వంటి చర్యలకు అదేపనిగా పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈమధ్యకాలంలో ఇది మరీ ఎక్కువైందని చెపుతున్నారు. ఇందులో కొంతమేరకు నిజం వున్నప్పటికీ, పచ్చమీడియా అతిరాతలు కూడా వున్నాయన్న వైసీపీ నాయకుల మాటల్లో కూడా కొంత నిజముంది.
అమ్మ కొట్టినందుకు కాదు…అన్నం పెట్టనందుకు!
సీఎం జగన్ తన కొత్త మంత్రివర్గంలో పాతవారిని 11 మందిని వుంచారు. ముందుగా 10 మందినే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో తిప్పేస్వామి స్థానంలో ఆదిమూలపు సురేష్ పేరు చేర్చారు. దీంతో బాలినేని షాకయ్యారు. తనకు పదవి రాకపోయినా పరవాలేదు కానీ, సురేష్‌కు రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక విధంగా చెప్పాలంటే, బాలినేని, ఆదిమూలపు వర్గాలకు మధ్య పొసగడం లేదు. మంత్రిపదవులిస్తే, ఇద్దరికీ ఇవ్వాలని, లేదా ఇద్దరినీ పక్కనబెట్టాలని బాలినేని మొదట్నించీ జగన్‌ను కోరుతూ వచ్చారు. అయితే తాను కంగుతినేలా సీఎం సీను మార్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారంనాడు బాలినేనిని కలిసినప్పుడు చూపించిన జాబితాలో ఇద్దరి పేర్లూ లేవు. దీంతో కొత్తగా అసహనమేమీ లేకుండాపోయింది. ఆ తర్వాత ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ పేరును చేర్చడంతో బాలినేని, అతని వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత సజ్జల తిరిగి ఆయనను కలిసినప్పుడు, ఎంత బుజ్జగించినా ఆయన వినలేదు. కొడాలి నానికి ఆఫర్ ఇచ్చినట్లుగా బాలినేనికి కూడా ఏదో ఒక ఆఫర్ వస్తుందని ఆశించారు. అదీ రాలేదు. దీంతో పుండుమీద కారం జల్లినట్లయింది. ప్రమాణ స్వీకార సమయానికల్లా ఏదైనా మార్పు జరగవచ్చునేమోనని కూడా అంచనా వేశారు. కానీ అది కూడా జరగలేదు. దీంతో బాలినేని వర్గీయులు తదుపరి కార్యాచరణలో పడ్డారు.
సీఎం పిలుస్తారా?
సోమవారంనాటి సమాచారం ప్రకారం, బాలినేని, అతని వర్గీయులు తమ పదవులకు రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. అలాగని ఇతర పార్టీల్లో చేరడం లాంటివేమీ వుండవు. రాజీనామాలు చేసి, మౌనంగా వుండిపోదామని భావిస్తున్నట్లు సమాచారం. కాకపోతే, సీఎం జగన్ ఆయనను వ్యక్తిగతంగా పిలిపించుకొని, సర్దుబాటు చేస్తారని ఒక వర్గం భావిస్తోంది. చూద్దాం! ఏం జరుగుతుందో! (Story: బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?)
See Also:
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!