వైసీపీలో అసమ్మతి సెగలు!
దిష్టిబొమ్మల దగ్థం, నిరసన జ్వాలలు
ఆశావహుల కన్నీటి పర్యంతం
రాజీనామాకు సిద్ధపడ్డ సుచరిత
సామాజికవర్గాల కూర్పులో కుదేలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అధికార పార్టీ వైసీపీలో తీవ్ర చిచ్చురేపింది. పదవులు కోల్పోయినవారిలో కొందరు, పదవులు దక్కనివారు ఇంకొందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అలకబూనారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈ స్థాయిలో అసంతృప్తి నెలకొనడం ఇదే మొదటిసారి. దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ కార్యకర్తలు తమ అభిమాన నాయకులకు పదవులు దక్కలేదంటూ నిరసనలు, ఆందోళనలకు దిగారు. సీఎం నిర్ణయాలతో అసంతృప్తి చెందిన పలువురు నేతలు తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బుజ్జగింపుల పర్వం కొనసాగుతూనే వున్నాయి. కొత్త మంత్రివర్గం తుది జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం వుందని కొందరు అనుకుంటున్నప్పటికీ, ఆదిమూలపు సురేష్ మార్పు తప్ప ఇంకేమీ వుండదని జగన్ సన్నిహితవర్గాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ, ఎక్కడో మినుకుమినుకుమంటున్న ఆశలతో అసమ్మతివాదులు సోమవారం ఉదయం ప్రమాణస్వీకార సమయం వరకు వేచిచూడాలని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఏం జరగుగుతోందోనని పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మాట వాస్తవం. ముఖ్యంగా క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సీఎం జగన్ పాత మంత్రుల్లో పది మందిని కొనసాగిస్తారని ప్రచారం జరగడంతో సీఎంకు స్వయానా బంధువైన బాలినేని అందులో తన పేరు ఉండకుండా పోతుందా అని ఆశించారు. కానీ, ఇప్పుడాయన పేరు లేదన్న క్లారిటీ రావడంతోనే తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఉదయం నుంచీ విజయవాడలో ఇంటికే పరిమితమయ్యారు. కనీసం పార్టీ నాయకుల్ని, అనుచరుల్ని కూడా కలిసేందుకు బయటకు రాలేదు. బాలినేని ఆవేదనతో ఉన్నట్లు తెలుసుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. కేబినెట్‌లో చోటు ఎందుకు ఇవ్వలేకపోయారో వివరించారు.బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సజ్జల సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ బాలినేని తొలుత రాజీపడలేదు. కాసేపటి తర్వాత సజ్జల అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మరోవైపు జగన్ క్యాబినెట్‌లో బాలినేనికి చోటు దక్కలేదన్న సమాచారంతో ఆయన నివాసానికి పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్దఎత్తున తరలి వచ్చారు. విజయవాడలోని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అనుచరుల ఆందోళన చేపట్టారు. బాలినేనిని మంత్రివర్గంలో కొనసాగించాలని అనుచరులు నినాదాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం బాలినేని ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
కంటతడి పెట్టిన ఆశావహులు
మరోవైపు ఎంతోకాలంగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పదవిని ఆశించారు. ఆయన పేరు లిస్టులో లేకపోవడంతో అనుచరులు సైతం నిరసన తెలియజేశారు. ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలు దగ్థం చేశారు. పిన్నెల్లికి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీతోపాటు.. ఇతర పదవులకూ రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అసంతృప్తిలో ఆయన అభిమానురాలు మంటల్లోకి దూకేందుకు ప్రయత్నించింది. కొత్త కేబినెట్‌లో ఎన్టీఆర్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. గుంటూరు జిల్లాలో సంచలన పరిణామంగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో అసంతృప్తినేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణలో తనకు గుర్తింపు దక్కలేదని నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు పార్టీకోసం ప్రభుత్వంతో పోరాడినట్లు గుర్తు చేస్తున్నారు. వైసీపీలో ముందు నుంచి ఉన్నా తమ నేతకు ప్రాధాన్యత దక్కలేదని కోటంరెడ్డి వర్గం అలకబూనారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా జగన్ వైపు నడిచినందుకు అక్రమ కేసులు ఎదుర్కొన్నామని.. అయినా మంత్రి వర్గ జాబితాలో గుర్తించకపోవడం దారుణమంటున్నారు కోటంరెడ్డి. రేపటి నుంచి నియోజకవర్గంలో కోటంరెడ్డి తలపెట్టిన గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం వాయిదా వేశారు. పండగ పూట ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. లిస్టులో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి చెప్పారు. పెనమలూరు (కృష్ణాజిల్లా)కు చెందిన కొలుసు పార్థసారధికి పదవి దక్కకపోవడం అతని అభిమానుల వీరంగానికి దారితీసింది. వారు రహదారిపై వాహనాలు ఆపుతూ కలకలం సృష్టించారు.
రాజీనామాకు సై!
వాస్తవానికి, జగన్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఏడు జిల్లాలకు జీరో ప్రాతినిధ్యమయింది. పాత మంత్రుల్లో తొలుత 10 మందిని కొనసాగిస్తూ జాబితా విడుదల చేశారు. ఆ తర్వాత 11 మందిని కొనసాగిస్తూ కొత్త జాబితా విడుదల చేశారు. ప్రధానంగా దళితవర్గానికి చెందిన మంత్రుల్లో ఒక్క సుచరితను తప్ప మిగతా అందరినీ కొనసాగించడంతో సీఎం నిర్ణయంపై మేకతోటి సుచరిత తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు అందరినీ కొనసాగిస్తూ తనను మాత్రం తప్పించడమేంటని సుచరిత సన్నిహితుల వద్ద వాపోయారు. తాను ఏ తప్పు చేశానని తొలగిస్తున్నారో అర్థం కావట్లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సుచరిత ప్రత్తిపాడు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. స్పీకర్ ఫార్మాట్‌లో ఆమె రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నారని సుచరిత సన్నిహితవర్గాలు వెల్లడిరచాయి. ఈ కొత్త క్యాబినెట్ కూర్పుపై సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడేందుకు సుచరిత గత రెండు రోజులుగా ప్రయత్నించినా, సజ్జల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి కోల్పోవడాన్ని సుచరిత తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. రాజీనామా విషయమై ప్రమాణ స్వీకార మహోత్సవం పూర్తయ్యాక సుచరిత తన అభిమానులతో మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
సామాజికవర్గాల కూర్పులో కొట్టుకుపోయారు!
పదవి దక్కినట్టే దక్కి చేజారడంతో తిప్పేస్వామి (శ్రీసత్యసాయి జిల్లా) అసహనానికి గురయ్యారు. అయితే తన స్థానంలో తన బావమరిది ఆదిమూలపు సురేష్‌ను తిరిగి తీసుకోవడం కాస్త ఊరట కలిగించింది. కాకపోతే ఇది ఇద్దరి అవగాహన మేరకు జరిగినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కళింగ సమాజిక వర్గానికి చెందిన స్పీకర్ తమ్మినేని సీతారామ్ మంత్రిపదవి ఆశించారు. కానీ అది దక్కకపోవడంతో స్పీకర్ పదవితోనే రాజీపడటానికి సంసిద్ధులయ్యారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రిపదవులు ఆశించిన ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ అర్బన్), గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి), అనంత వెంకట్రామరెడ్డి (అనంతపురం), తోపుదుర్తి ప్రకాశరెడ్డి (రాప్తాడు), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం)లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణప్రసాద్ (మైలవరం), అబ్బయ్య చౌదరి (దెందులూరు), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ)లు జగన్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. ఎస్టీల నుంచి ఒక్క రాజన్నదొరకే పదవి దక్కింది. తెల్లం బాలరాజు (పోలవరం), భాగ్యలక్ష్మి (పాడేరు), చెట్టి ఫల్గుణ (అరకు)లు నిరాశకు గురయ్యారు. పైగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఏ ఒక్కరినీ తీసుకోకకపోవడం మరింత అసంతృప్తిని కలిగించింది. మహిళల్లో ముగ్గురు మంచి ఫలితాలు సాధించారు. కానీ రెడ్డి శాంతి (పాతపట్నం), జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల), విశ్వాసరాయి కళావతి (పాలకొండ)లు మాత్రం నిరాశను చవిచూడాల్సి వచ్చింది. ఎస్సీల్లో గొల్ల బాబూరావు (పాయకరావుపేట), తలారి వెంకటరావు (గోపాలపురం), వరప్రసాదరావు (గూడూరు), ఆర్థర్ (నందికొట్కూరు), పండుల రవీంద్రబాబు (ఎమ్మెల్సీ)లతోపాటు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు (ఎమ్మెల్సీ), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), జక్కంపూడి రాజా (రాజానగరం), గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)లు తీవ్రమైన మానసిక వేదనకు గురైనట్లు సమాచారం. (Story: వైసీపీలో అసమ్మతి సెగల దారెటు?)
See Also:
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అసలు రివ్యూ ఇదే!