జ్వరం టాబ్లెట్ రూ. 100
రోజుకు 10 గంటలు పవర్ కట్, ధరలు ఆకాశానికి!
కోడిగుడ్డు రూ.35, కిలోచికెన్ రూ. 1000
కొలంబో: జ్వరమొస్తే టాబ్లెట్ వేసుకోవాలి. కానీ ఒక టాబ్లెట్ ఎంతో తెలుసా. 100 రూపాయలు. ఇది కనీవినీ ఎరుగని రేటు. కిలో చికెన్ ఎంతో తెలుసా? వెయ్యి రూపాయలు. ఒక కోడిగుడ్డు ధర ఎంతనుకున్నారు? ఐదు రూపాయలని భావిస్తున్నారా? కాదు. 35 రూపాయలు. కళ్లు జిగేల్ మన్పించే ఈ ధరలు ఎక్కడో తెలుసా? మన పొరుగున ఉన్న శ్రీలంక దేశంలోనే! శ్రీలంక ఏనాడూ ఊహించలేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్నది. ఫలితంగా ఆహార సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, ఆర్థిక విధానాలే ఈ రేట్లకు కారణం. 1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోంది. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ధరలు చూస్తే కళ్లు పైర్లు కమ్ముతాయి. కోడి గుడ్డు రూ.35, లీటర్ కొబ్బరి నూనె రూ.900, కిలో చికెన్ రూ.1000, కిలో పాల పొడి రూ.1945… ఇలా ఒకటేమిటి? అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. జనం ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అల్లాడిపోతున్నారు. బయట ఒక జ్వరం మాత్ర కొనాలంటే 100 రూపాయలపైనే చెల్లించాలి. లీటరు పెట్రోల్‌ధర రూ.300 దాటింది. పైగా పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఇవిచాలదన్నట్లు…విద్యుత్ సమస్య కూడా వచ్చిపడిరది. రోజుకు 10 గంటల పాటు శ్రీలంక ప్రజలు కరెంటు లేక విలవిల్లాడుతున్నారు. శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఇంధన కొరత. దీని వల్లే విద్యుత్ లేక కోతలు మొదలయ్యాయి. తాజాగా ఈ పవర్ కట్ సమయాన్ని మరింత పెంచుతూ లంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రోజుకు 7 గంటలు విధిస్తోన్న కరెంట్ కోతను బుధవారం నుంచి 10 గంటలకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ పాలనపై విసుగెత్తిన జనం ఆందోళనకు దిగుతున్నారు. (Story: జ్వరం టాబ్లెట్ రూ. 100)
See Also: క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)