సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ
పెనుగొండ లక్ష్మీనారాయణ
తెనాలి సాంస్కృతిక చైతన్య దీపిక, తెనాలి సాంస్కృతిక చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అభ్యుదయ సాహితీవేత్త నేతి పరమేశ్వరశర్మ. పరిపూర్ణ జీవితం గడిపిన ఆయన 94 ఏళ్ళ వయసులో ఈ నెల 16న తెనాలిలో కన్నుమూశారు. 1928లో కృష్ణాజిల్లా దివిసీమలో నంగేగడ్డ గ్రామంలో నిమ్మగడ్డ సుబ్బమ్మ, శ్రీరాములుకు జన్మించిన శర్మ 5 సంవత్సరాల వయసులో తెనాలి వాస్తవ్యులు నేతి కమలాంబ, సీతారామస్వామికి దత్తుడయ్యాడు.
శర్మ బాల్యమంతా తెనాలికి అతి సమీపంలోని పెదరావూరు గ్రామంలో గడిచింది. తెనాలి సాంస్కృతిక ప్రభావం ఆ గ్రామంపైనా ఉంది. ఆ వూరిలో నాటక ప్రదర్శనలు జరిగేవి. అన్న చలపతిరావు ప్రోత్సాహంతో ‘రంగూన్ రౌడి’ నాటకంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ పాత్ర ధరించారు. అదే వారికి తొలి నాటకానుభవం. తరవాత సాంస్కృతిక రంగానికి చేరువైనారు. ముఖ్యంగా నాటక రంగానికి సేవ చేయటాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించారు. తెనాలిలోని క్రాంతి థియేటర్‌కు 1952లో కార్యదర్శిగా ఎన్నికైనారు. తెనాలిని కేంద్రంగా చేసుకొని విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అనేక నాటకాలలో 35, 40 సంవత్సరాల పాటు విభిన్న ప్రవృత్తి గల పాత్రలు పోషించారు.
‘‘నాటక పోటీలకు వెళ్లాలన్న, బహుమతులు సంపాదించాలన్న కోరిక మాకు పెద్దగా ఉండేది కాదు. ఈ పరిషత్తు నాటక పోటీలు బూర్జువా సంప్రదాయాలని, ఎవరో నలుగురు కలిసి చేసే న్యాయ నిర్ణయంపైన నటుని నటనా కౌశలం నిర్ణయం కాదని, ప్రజాతీర్పు మించినది లేదని, గుర్తింపు ప్రజల్లో రావాలిగాని, పరిషత్తుల ద్వారా కాదని భావించేవాళ్లం. అసలు చాలా కాలం పరిషత్తులను పట్టించుకోలేదు. పైగా మా నాయకులు కూడా పోటీలను అంతగా ప్రోత్సహించేవారు కాదు. అయినా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొని బహుమతులు సంపాదించాను’’ అని ‘స్వకీయం’లో చెప్పుకున్న ప్రజా కళాకారుడు పరమేశ్వరశర్మ. ఈ మాటలను బట్టి వారికి కళారంగంపై స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తుంది.
తెనాలిలో నివాసమేర్పరచుకున్న పరమేశ్వరశర్మ తనకున్న కమ్యూనిస్టు రాజకీయ నమ్మకాల వల్ల, అవిశ్రాంతంగా కళారంగంలో పాల్గొంటున్నందువలన ఉద్యోగం సంపాదించుకోలేకపోయారు. అయితే తెనాలి తాలూకా హైస్కూల్ కమిటీ కార్యదర్శి కల్లూరి కృష్ణమూర్తి కొన్ని షరతులతో ఉపాధ్యాయ ఉద్యోగం కల్పించారు. ఆ ఉద్యోగం చేస్తూనే నాటక రంగ కార్యకలాపాలను నటుడిగా, కార్యకర్తగా విస్తృతపరచుకున్నారు. 1965 నాటికి క్రాంతి థియేటర్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అదే సంవత్సరం నటరాజ కళామందిర్‌ను స్థాపించారు. దాదాపు రెండేళ్లపాటు ఆ సంస్థలో సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించారు. సాంఘిక నాటక రంగం క్రమక్రమంగా పరిషత్తులకే పరిమితమవుతున్న పరిస్థితి. తెనాలిపై కూడా ఆ ప్రభావం పడటాన్ని గ్రహించారు శర్మ. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి తెనాలిలో కొన్ని సమాజాల ప్రతినిధులను కలుపుకొని ‘ది తెనాలి యునైటెడ్ ఎమెచ్యూర్స్’ అనే ఒక నాటక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సమాజం ద్వారా ప్రముఖ నాటక రచయిత కొడాలి గోపాలరావు రచించిన ‘దొంగ వీరడు’ నాటకాన్ని అనేక ప్రదేశాలలో టిక్కెట్లు అమ్మి ప్రదర్శించారు. అప్పటి వరకూ తెలుగు సాంఘిక నాటక రంగంలో టిక్కెట్లు అమ్మి ప్రదర్శించటం జరగలేదు. ఒక కొత్త మంచి సంప్రదాయానికి శర్మ ఆధ్వర్యంలో తెర లేచింది. దొంగ వీరడు నాటకాన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు పలువురు చలనచిత్ర నటులు హాజరై అభినందించారు. ఇలా తెనాలి రంగస్థల కీర్తి ప్రతిష్ఠలను మద్రాసు నగరంలో సైతం చాటారు. ఆ తరవాత ‘కళాభారతి’ అనే నాటక సంస్థను పలువురు స్థానిక కళాకారుల సహకారంతో తెనాలిలో నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా ‘జై భవానీ’ నాటకాన్ని తెనాలిలోనేగాక ఈ నాటకంలో బాజీ ప్రభువు పాత్రను ప్రసిద్ధ రంగస్థల నటులు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి నటిస్తే, పరమేశ్వరశర్మ హీరో పాత్ర పోషించారు. ఈ నాటకం తెలుగు నాటకానికి అందునా ఔత్సాహిక నాటక రంగానికి ఊపిరందించిందన్నారు శర్మ.
తెనాలిలో ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తితో కలిగిన పరిచయంతో ‘ఉత్తమ చలనచిత్ర అభిమానుల సంఘం’ ఏర్పాటు చేశారు. దానికి తొలి అధ్యక్షుడు పరమేశ్వరశర్మే. 1986లో ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ గావించారు. తరవాత తెనాలిలో జరిగిన అనేక నాటక పోటీల నిర్వహణలో పాలుపంచుకున్నారు. తెనాలిలో పట్టణ రంగస్థల తొలి కార్యవర్గంలో ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఎందరో పేద కళాకారులకు పెన్షన్ సౌకర్యం కలిగించటంలో కృషి చేశారు. తరవాత ‘అభ్యుదయ కళా సమితి’ కార్యదర్శిగా సాంఘిక ప్రయోజనాన్ని కలిగించే కార్యక్రమాలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలి గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తూ 1989లో ప్రజానాట్యమండలి మహాసభలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని 1943లో ఆవిర్భవించిన అరసం స్వర్ణోత్సవాలను 1994 ఫిబ్రవరి 12,13 తేదీలలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు బొల్లిముంత శివరామకృష్ణ. నేను కార్యకర్తను. రాష్ట్ర వ్యాపితంగా ఎందరో ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్తలు హాజరైన సభలివి. తెనాలిలోని పలు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శిగా, నేతగా వాటి నిర్వహణలో తన వంతు సహకారాన్ని అందించి తెనాలి సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటిన కళాజీవి నేతి పరమేశ్వర శర్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవ పోటీలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. పరమేశ్వర శర్మ అనేక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు. నటునిగా కీర్తినార్జించారు. ఎంతో ప్రతిభావంతమైన నటుడైన పరమేశ్వర శర్మ ఒకే ఒక్క చలనచిత్రం ‘స్వాతంత్య్రం మా జన్మహక్కు’లో నటించారు. మరిన్ని అవకాశాలు లభించేవి ఆయనకు. తెనాలిని వదలలేకపోయారు.
తెనాలి సాంస్కృతిక సాహిత్య చరిత్రను వివరిస్తూ ‘నూరేళ్ల తెనాలి రంగస్థలి’ రచన చేపట్టారు. మే 1998న ప్రథమ ముద్రణ. మరికొన్ని చేర్పులతో జూన్ 2006లో మలి ముద్రణ గావించారు. ఈ పుస్తకానికి ముఖచిత్రాన్ని అందించినవారు బాపు. 778 పుటల ఈ పుస్తకం ఎంతో సంచలనాత్మకమైనది. వందల కొద్దీ కళాకారులు, రచయితల ఛాయా చిత్రాలు, ఎన్నో అపురూపమైన చిత్రాలను, జీవిత విశేషాలను, సంస్థల వివరాలను అందించారు. ఏడు పదుల వయసులో వయోభారాన్ని లెక్కచేయక అనేక ఊర్లు, ప్రాంతాలు పర్యటించి విశేషంగా విషయ సేకరణ చేశారు. ఈ పుస్తకాన్ని అమెరికాలోని డా॥ రాబర్ట్ పుల్టన్ రీజనల్ లైబ్రరీవారు రిఫరెన్స్ గ్రంథంగా స్వీకరించారు. పత్రికలు, ప్రముఖులు ఎంతగానో ఆయనను ప్రశంసించారు. ఈ పుస్తక ప్రచురణ సమయంలో నాతో అనేకసార్లు సమాచారం కొరకు ముచ్చటించారు. కోరిన సమాచారాన్ని అందించాను. ఈ అపురూప గ్రంథ రచనలో నా స్వల్ప సహకారం ఉన్నందుకు సంతోషిస్తున్నాను.
ఆంధ్రరాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అభ్యుదయ సాహితీవేత్త పులుపుల వెంకటశివయ్య పేరిట నెలకొల్పిన ‘అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారాన్ని’ 2008 సంవత్సరంలో అరసం జిల్లాశాఖ గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో నేతి పరమేశ్వరశర్మకు అందించాం. ప్రజా సాంస్కృతికోద్యమంలో, అభ్యుదయ సాహిత్యోద్యమంలో ఏడు దశాబ్దాలకు పైగా అవిశ్రాంత కృషి చేసిన నేతి పరమేశ్వరశర్మ ‘మృతియే లేకున్న రుచియేది బతుకులోన’ అన్న గాలీబు పాటను రుజువు చేస్తూ జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించారు. అభ్యుదయ రచయితల సంఘం పక్షాన వారికి జోహార్లు.
– వ్యాస రచయిత అరసం జాతీయ కార్యదర్శి
9440248778
(Story:సాంస్కృతిక ఆణిముత్యం నేతి పరమేశ్వరశర్మ)
See Also: నేటికీ రష్యా ఆయిల్‌పై ఆధారపడుతున్న దేశాలివే!
రష్యన్ చమురుపై ఆంక్షలు సాధ్యమేనా?