గుడ్లవల్లేరు ఘటనపై సీఎం సీరియస్!
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన విచారణపై సీఎం చంద్రబాబు సమీక్ష
జిల్లా కలెక్టర్, ఎస్పీ, విచారణ అధికారులు, జెఎన్టియు విసి, సైబర్ నిపుణలతో సమీక్షించిన సిఎం
విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు
తప్పు జరిగిందని తేలితే బాధ్యులను వదలం
ఆడబిడ్డల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
సైబర్ నిపుణులతో లోతుగా దర్యాప్తు :- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
న్యూస్‌తెలుగు/అమరావతి : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు పెట్టారనే అంశంలో జరుగుతోన్న విచారణపై సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఘటన వెలుగు చూసిన తరువాత ఎస్పీ, కలెక్టర్ ను నిన్న కళాశాలకు పంపిన ముఖ్యమంత్రి…అప్పటి నుంచి విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వందల మంది విద్యార్థినులకు సంబంధించిన అంశం కావడంతో ఘటనను సిఎం సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై కేసు రిజస్టర్ అయిన అనంతరం జరుగుతున్న విచారణపై సిఎం రివ్యూ చేశారు. ఇప్పటి వరకు విచారణలో సాధించిన పురోగతిపై అధికారులతో చర్చించారు. విద్యార్ధినులు చెప్పే అంశాల ఆధారంగా లోతుగా, అన్ని కోణాల్లో విచారణ జరపాలన్నారు. ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో హిడెన్ కెమేరాలు ఏవీ దొరకలేదని అధికారులు చెప్పగా…మరింత లోతుగా విచారణ జరపాలన్నారు. అనుమానితుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను సైబర్ నిపుణుల ద్వారా పరిశీలించాలన్నారు. డాటా తొలగించే అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని టెక్నికల్ గా ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలన్నారు. ఆడబిడ్డల భద్రత, మహిళల వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ఆధ్వర్యంలో డీ బగ్గింగ్ డివైసెస్ తో అన్ని చోట్లా తనిఖీలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
నేరం జరిగిందా లేదా అనేది పూర్తి విచారణ తరువాతనే తేలుతుందని….తప్పు జరిగిందని తేలితే మాత్రం నిందితులను వదలేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థినుల మనోభావాలను గౌరవించాలని సిఎం సూచించారు. వారి ఆవేదన అర్థం చేసుకుని విచారణ చేయాలని సూచించారు. చదువుకునే ఆడబిడ్డలకు ఇలాంటి వివాదం తలెత్తితే మానసికంగా తీవ్ర ఆందోళన చెందుతారని…వారికి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరి దగ్గరైనా ఘటనకు సంబంధించి అదనపు సమాచారం, ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని సిఎం కోరారు. ఇదే సమయంలో కొందరు ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విద్యార్ధులను మరింత భయపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని….అలాంటి వారి చర్యలను అడ్డుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. సున్నితమైన అంశాల విషయంలో తప్పుడు ప్రచారం మరింత నష్టం చేస్తుందని సిఎం అన్నారు. ఎప్పటికప్పుడు విచారణ వివరాలు తనుకు చెప్పాలని….ఘటనలో తప్పు ఉందని తేలితే మాత్రం ఎవరినీ ఉపేక్షించేది ఉండదని సిఎం స్పష్టం చేశారు. తిరిగి విద్యార్థినులు ప్రశాంతంగా చదువు కొనసాగించే పరిస్థితి కల్పించాలని సిఎం అధికారులను ఆదేశించారు. (Story : గుడ్లవల్లేరు ఘటనపై సీఎం సీరియస్!)