ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి : ఏఐకేఎస్
న్యూస్‌తెలుగు / వనపర్తి : ఆంక్షలు లేకుండా రూ. రెండు లక్షల వరకు గల రైతుల పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు, వనపర్తి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రాబర్ట్ మాట్లాడారు. రుణమాఫీకి రాష్ట్రంలో 43 లక్షల పైగా రైతులు అర్హత సాధించగా, ఆగస్టు 15 నాటికి 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రెండు లక్షలకు పైగా ఉన్న అప్పును చెల్లిస్తేనే రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఆంక్షలు పెట్టడమే కారణమన్నారు. రైతు పాస్ బుక్, బ్యాంకులో అప్పు ఖాతా పేర్లలో తప్పుల కారణంగా, రేషన్ కార్డు లేదని నెపంతో అప్పులు మాఫీ చేయలేదన్నారు. చాలా సహకార బ్యాంకులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అప్పులు మాఫీ కాలేదన్నారు. చాలామంది రైతుల అప్పుల వివరాలని ప్రభుత్వానికి పంపలేదన్నారు.రైతుల రుణమాఫీకి బ్యాంకులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది రైతుల అప్పు ఖాతాలో జమ కాలేదన్నారు. అర్హత ఉండి అప్పు మాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఇండ్లకు వెళ్లి విచారణ చేసి మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది అమలు కావడం లేదన్నారు. ప్రతి మండలంలో వందల కొద్ది అర్హత ఉన్న మాఫీ కానీ రైతులు దరఖాస్తులు చేస్తున్నారన్నారు. రుణమాఫీ చేసిన రైతులకు వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ అసైన్మెంట్ భూములకు రుణాలు ఇవ్వటం లేదని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ. 15000 ఇస్తామని ప్రకటించిన అభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన తగదన్నారు. ఈ వర్షాకాలం సీజన్ అయిపోవస్తున్న ఇంకా తేల్చకపోవడం సరికాదన్నారు. రైతు భరోసా డబ్బులు రైతు ఖాతాలో జమ చేయాలన్నారు. ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) నాగేష్ కు వినతిపత్రం సమర్పించారు ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, సిపిఐ పట్టణ కమిటీలు ధర్నాకు మద్దతు పలికాయి. జే రమేష్, శ్రీహరి, గోపాలకృష్ణ, ఎత్త మహేష్, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు. (Story : ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి : ఏఐకేఎస్)