ఉచిత వైద్య శిబిరం
న్యూస్‌తెలుగు /విజయనగరం : ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలపై ప్రజలు అప్రమాతులుగా వ్యవహరించాలని పట్టణానికి చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల వైద్యనిపుణులు డాక్టర్ అవనాపు భాను ప్రకాష్ సూచించారు. పట్టణంలోని వైయస్సార్ నగర్ లో యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఊపిరితిత్తుల వైద్యనిపుణులు డాక్టర్ ఏ భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా పొగ త్రాగే వారిలోను, సిమెంట్ ఫ్యాక్టరీలు వంటి దుమ్ము ధూళి వాతావరణంలో పని చేసే వారిలో ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా వస్తాయన్నారు. ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినట్లయితే అశ్రద్ధ చేయకుండా అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించాలని సూచించారు. టీబి వంటి వ్యాధులకు కూడా ఇప్పుడు పూర్తిగా నయం చేసేందుకు చికిత్సలు ఉన్నాయని, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ శిబిరానికి వచ్చిన వందలాదిమందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ వైద్య శిబిరంలో సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. బిపి చక్కెర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఏసు ప్రేమాలయం పాస్టర్ అలజంగి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో బిషప్ వి.జాషువ, సిస్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. (Story : ఉచిత వైద్య శిబిరం )