ద్వారంపూడి అక్రమాలపై చర్యలు చేపట్టాలి
ఎస్పీకి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే వనమాడి
న్యూస్‌తెలుగు/కాకినాడ: కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరుల ఐదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు ఆకృత్యాలకు దిగారని వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతిపత్రం అందించారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్ పాటిల్కు వినతి పత్రం అందించి గడచిన ఐదేళ్ల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అతని అనుచరులు చేసిన ఆకృత్యాలు దౌర్జన్యాలపై తెలియజేశారు. అనంతరం వనమాడి జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ 2020 జనవరిలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి బాలాజీ చెరువు సెంటర్లో జరిగిన ఒక సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్పై పరుష జాలంతో అనవసర వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిపై తాము అప్పుడు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే 2021 అక్టోబర్లో జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా ద్వారంపూడి మనుషులు, రౌడీషీటర్లు, వాళ్ళ అనుచరులు గుంపులుగా వచ్చి తమ పార్టీ రాష్ట్ర నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభితో పాటు పలువురు నాయకులపై దాడి చేసి విధ్వంసం చేయించారన్నారు. చర్యలు తీసుకోవాలని అప్పుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. అలాగే 2019 నవంబర్లో సంజయ్ నగర్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన మూడు ఇల్లులను ద్వారంపూడి మనుషులు సుమారు పదిమంది వచ్చి జెసిబితో కూల్చి ధ్వంసం చేశారన్నారు. వారిని అరెస్ట్ చేయాలని పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్లేదన్నారు. అలాగే కాకినాడ సినిమా రోడ్లో ఉన్న సంత చెరువు వద్ద కౌన్సిల్ తీర్మానం చేసి దివంగత నేత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా 2023లో ద్వారంపూడి అతని అనుచరులు జొన్నాడ చినబాబు, సుంకర విద్యాసాగర్, మల్లిపాముల గణపతి, బల్ల సూరిబాబు బొందు దీపక్ వంటి రౌడీషీటర్లు, దుండగులు కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేయగా తమకు తెలిసి అడ్డుపడితే అర్ధరాత్రి దౌర్జన్యంగా వేరే చోటికి మార్చారన్నారు. ఎన్టీఆర్ విగ్రహ అవమానం చేసిన ద్వారంపూడి వాళ్ళ అనుచరులపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఈ అక్రమాలకు, దౌర్జన్యాలకు సంబంధించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగ్లను, పత్రికా ప్రతులను, పెన్ డ్రైవ్ ద్వారా జిల్లా ఎస్పీకి అందించినట్లు ఎమ్మెల్యే వనమాడి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు ఒమ్మి బాలాజీ, బోళ్ళ కృష్ణమోహన్, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ద్వారంపూడి అక్రమాలపై చర్యలు చేపట్టాలి)