ప్రభుత్వ ఆసుపత్రి మరమ్మతు పనులు త్వరగా చేయాలి
ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలి
న్యూస్తెలుగు/ వనపర్తి : ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుచున్న మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి భవనం పరిసరాలతో పాటు శవాగారం, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్, స్టాఫ్ రూమ్, పాథాలజి గదులను పరిశీలించారు. ఇప్పటికే మంజూరు అయిన మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా శ్రీ భారత్ ఫార్మా ద్వారా ఏర్పాటు చేస్తున్న నూతన ఆక్సిజన్ ప్లాంట్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో చేయాలని, మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు కావాలంటే ఇస్తానని, వెంటనే ప్రతిపాదనలు పెట్టాల్సిందిగా ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సైతం అప్పుడే పుట్టిన బిడ్డల వార్డుకు ఆక్సిజన్ సౌకర్యం అందించే విధంగా మరో ఆక్సిజన్ ప్లాంట్ అక్కడ నెలకొల్పాలని శ్రీ భారత్ ఫార్మా సిబ్బందిని సూచించారు.ఆసుపత్రి సుపరిండెంట్ రంగా రావు ఉన్నారు. (Story : ప్రభుత్వ ఆసుపత్రిలో మరమ్మతు పనులు త్వరగా చేయాలి )