కుష్టువ్యాధి పై అవగాహన తప్పనిసరి
న్యూస్తెలుగు/విజయనగరం : కుష్టు వ్యాధి పై అవగాహన కలిగి ఉండాలని చెల్లూరు లెప్రసీ మిషన్, హీల్ ప్రాజెక్ట్ ప్రతినిధి డాక్టర్ తాలాడ దీప్తి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుష్టువ్యాధి ఇంటింటి సర్వే ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం చెల్లూరులోని ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థులకు కుష్టు వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కుష్టువ్యాధి మైకో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల వస్తుందన్నారు. ఈ క్రీములు రోగి తుమ్మడం, దగ్గడం వల్ల ఇతరులకు వ్యాప్తి చెందుతుందన్నారు. శరీరం పై స్పర్శ లేని మచ్చలు, కాళ్లు లేదా చేతుల కండరాల బలహీనత, కళ్లు పూర్తిగా మూసుకో లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఉచితంగా అందజేస్తారన్నారు. కుష్టువ్యాధి లేని జిల్లాగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై రాము, ఉపాధ్యాయులు, సీడీఓ వంశీ, ఆశావర్కర్లు పాల్గొన్నారు. (Story : కుష్టువ్యాధి పై అవగాహన తప్పనిసరి)