ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి
అంకుశాపూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలి
అడ,పిపిరావు,కొమురం భీం ప్రాజెక్ట్ కాలువలు పూర్తి చేయాలి
కర్జవెల్లి-గూడెం బీటీ రోడ్డు వెంటనే నిర్మించాలి
గులాబీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి
తెలంగాణ వాదులకు,పార్టీ కార్యకర్తలకు పిలుపు
డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
న్యూస్‌తెలుగు/ కొమురం భీం, కాగజ్ నగర్ : వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని భారాస నేత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన సిర్పూర్ నియోజవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ.4,350 కోట్లతో నారాయణపేట- కొడంగల్
ఎత్తిపోతల చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2008లో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయుటకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం నాటి ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు చేసినా రైతులకు చుక్క కన్నీరు అందడం లేదని విమర్శించారు. ప్రాజెక్టుకు సేకరించిన భూములకు ఇంకా రైతులకు నష్టపరిహారం అందించలేదని, తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న తుమ్మిడిహట్టి,సాండ్ గాం,రణవెల్లి,కోర్సిని, గూడెం, హుడికిలి,లోనవెల్లి, సూర్జాపూర్, జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు.పక్కనే ప్రాణహిత నది ఉప్పొంగుతున్న సిర్పూర్ రైతులు వర్షం కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న అడ,పిపి రావు ప్రాజెక్టులు,కొమురంభీం కాలువలు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని అన్నారు..చెరువుల నుండి పంట పొలాలకు నీరుపారే కాలువలు పూడుకుపోయి,తూము ద్వారం గేట్లు మరమ్మతులకు చేయాలన్నారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.
అంకుశాపూర్ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి
కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ లో అధికార కాంగ్రెస్ నాయకులు చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పులుల అభయరణ్యానికి కేవలం 60 మీటర్ల దూరంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. పులులు చనిపోతే ఆదివాసి బిడ్డలను చిత్రహింసలకు గురి చేసిన అధికారులు ఇథనాల్ ఫ్యాక్టరీపై లలో అటవీ శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
కర్జవెల్లి-గూడెం బీటీ రోడ్డు నిర్మించాలి
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కర్జవెల్లి-గూడెం మార్గానికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్జవెల్లి- గూడెం రోడ్డు వర్షాలకు దెబ్బతిని నరక కూపంలా మారిందని అన్నారు. దిందా, అందవెల్లి వంతెనను నిర్మించాలని, ఎందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందవెల్లి బ్రిడ్జి వద్ద వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిడ్జిని పూర్తి చేయుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.
సిర్పూర్ ప్రాంతాన్ని దోచుకోవడానికే ఆంధ్ర ప్రాంతం నుంచి కొందరు వలస వచ్చారని ఆరోపించారు. భౌగోళికంగా ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోయిన సిర్పూర్ లో మాత్రం ఆంధ్ర పెత్తందారుడైన దుష్టపాలన సాగిందన్నారు. అధికారం అండతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భారాస నేతలపై గుండా గిరిని సహించమని అన్నారు.అధికార పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన పలు ఈ ప్రాంతాన్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదన్నారు.
ఆంధ్ర గుండాగిరి తెలంగాణలో నడవదన్న ఆయన ఉద్యమకారులు ఏకమై మళ్లీ భారాసను అధికారంలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ చేస్తామన్నారు.
ఎస్పీఎం ఎన్నికలు జరపాలి
సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల ఎన్నికలు తక్షణమే జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్పీఎంలో స్థానిక ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ, స్థానికేతరులకు మాత్రం అధిక వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు.
పదవులు అనుభవించి పార్టీని వీడినవారు ఉద్యమ ద్రోహులు
భారాస పాలనలో రాజకీయ పదవులు అనుభవించి, అధికారం కొల్పోగానే భారాసను వీడి కాంగ్రెస్ లో చేరిన భారాస ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ఉద్యమ ద్రోహులని, ఈ ప్రాంతాన్ని మరింత దోచుకోవడం కోసమే పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.
పార్టీ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ గా లెండేగురే శ్యామ్ రావ్
సిర్పూర్ నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గా లెండేగురే శ్యామ్ రావ్ నియామకమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కన్వీనర్లు నియమించారు.సిర్పూర్-అస్లాం బీన్ అబ్దుల్లా, బెజ్జర్ – సోయం చిన్నయ్య, కాగజనగర్ – ఆవుల రాజకుమార్, దహెగాం-నస్ఫర్ లక్ష్మి, కౌటాల – బండు పటేల్ ,
పెంచకల్ పేట-బిట్టు శ్రీనివాస్ లను నియమించారు. (Story : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి)