దాడిలో గాయపడ్డ వైసిపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బొల్లా
న్యూస్ తెలుగు/ వినుకొండ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు పార్టీ అండగా ఉంటుందని వైయస్ ఆర్. కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఇటీవల టిడిపి నాయకులు చేతిలో కత్తిపోట్లకు గురై ఇబ్బందులు పడుతున్న టీ అన్నారం గ్రామానికి చెందిన భీమనాదం వెంకట ప్రసాద్ వారి సతీమణి శ్రావణి లకు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆర్థిక సహాయం అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంకట ప్రసాద్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేయగా, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అదనంగా రూ.1 లక్ష సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. టి అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసు తో భీమనాదం వెంకట ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టిడిపి నాయకులు కత్తితో దాడి చేశారని, 45 రోజులు చికిత్స అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని అన్నారు. ఇప్పటివరకు పోలీసులు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని, నామమాత్రపు కేసులు నమోదు చేసి నేరస్తులు వదిలిపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం వినుకొండ టౌన్ సీఐ, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మెప్పుకోసం వైసీపీ కార్యకర్తలపై ఆధారం లేని కేసులు పెడుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ వేధిస్తున్నారని అన్నారు.
కేసులకు భయపడమని న్యాయ పోరాటానికి దిగి వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతోనే కారుమంచి గ్రామంలో 16 మంది వైసీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని, వినాయక చవితి సందర్భంగా జరిగిన గొడవను కూడా ఎలాంటి తప్పు లేకపోయినా కేవలం ఒకవైపున కేసు నమోదు చేయడం దుర్మార్గమని ప్రశ్నించారు. అలాగే బొల్లాపల్లి మండలంలో పలుకూరు గ్రామంలో రేషన్ డీలర్ పై టిడిపి నాయకులు దాడి చేశారని, ఏ గ్రామంలో చూసిన అరాచకాలు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చీఫ్ విప్ పదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ ఎస్ పి లో 4 లక్షల రూపాయలకే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలని బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. వైసిపి హయాంలో నిర్మించిన అదనపు గదులు ముందు ఫోటోలకు ఫోజులిస్తూ నిర్మాణం పూర్తికాని గదుల ముందు ఫొటోలు దిగి ప్రారంభించాలని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. వినుకొండకు 150 కోట్లు నిధులు తెచ్చామని చెప్తున్నా ఎమ్మెల్యే ఏ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం మెంతా తుఫాన్ తో లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి రైతులు నానా అవస్థలు పడుతుంటే ఆదుకునేది పోయి, నష్ట పరహారం ఇవ్వాల్సింది పోయి రైతు భరోసా ఇస్తున్నామని చెబుతూ పంట పొలాల్లో ఫోటోలకు ఫోజులిస్తున్నారని, తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అన్నారు. కనీసం పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చెయ్యలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలను వేధించడం మానుకొని అభివృద్ధి కోసం కృషి చేయాలని హితవు పలికారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి హాని జరిగిన వారికి అండగా ఉంటామని, అన్ని విధాలుగా వారి తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. (Story:దాడిలో గాయపడ్డ వైసిపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బొల్లా)

