స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు/చింతూరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో *స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరిటెండెంట్ డాక్టర్ ఎమ్.కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేది వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు.ప్రస్తుత సమాజంలో మహిళలను తక్కువగా చూడటం, చదువులో గాని,ఉద్యోగరీత్యా పని చేసే ప్రదేశంలో గాని వివక్షత చూపటం దురదృష్టకరమన్నారు.ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు తమ హాస్పిటల్ లో అన్ని టెస్టులు నిర్వహిస్తామని, మహిళల్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామని, ENT, డెంటల్ క్యాంప్ కూడా కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు పౌష్టిక ఆహారం లోపం వల్ల రోగాల బారిన పడుతున్నారని, ఆకుకూరలు- పప్పు దినుసులు తీసుకోవడం ద్వారా నివారణ చేయవచ్చునన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, క్యాన్సర్ వంటి వ్యాధులకు నివారణ చర్యలు చేపట్టడానికి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కళాశాల సీనియర్ అద్యాపకులు జి. వెంకట్రావు మాట్లాడుతూ రోగులు మరియు డాక్టర్ల నిష్పత్తి మనదేశంలో చాలా తక్కువగా ఉందని, మనదేశములో మహిళలకు ఇమ్యూనిటీ తక్కువగా ఉందని, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం, సరిపడనిద్ర కలిగి ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ ఎమ్ కోటిరెడ్డిగారిని అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. హిందీ విభాగధిపతి కె. శైలజ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. (Story:స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పై అవగాహన సదస్సు)

