రాధా డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు / వినుకొండ : పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, వినుకొండ సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని రాధా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సమీర్ భాష, సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. డ్రగ్స్ కు బానిసలైతే భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో తెలిపారు. అలాగే ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని, దీనివల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాధా డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story:రాధా డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు)

