14 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయించాలి..
– ఆధునిక వ్యవసాయంతో ఆర్థిక ప్రగతి
– ఉద్యాన పంటల వైపు రైతును ప్రోత్సహించాలి
– 19న జరిగే కిసాన్ మేళాను జయప్రదం చేయాలి..
– ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆధునిక వ్యవసాయం తోనే రైతు ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల్లో అవగాహన పెంపొందించి ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. మంగళవారం ఏనుగుపాలెం రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఫెర్టిలైజర్స్ డీలర్లు, సహకార సంఘాల సీఈఓ ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు ఆదాయం వచ్చే పంటల సాగు చేసినప్పుడు నియోజకవర్గం ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. మన ప్రాంతంలో 1.30 లక్షల ఎకరాలు సాగు భూమి ఉందని, దానిలో ఈ ఏడాది 14వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించాలని కోరారు. పండ్ల తోటల సాగుతో ఎకరాకు లక్ష రూపాయలు ఆదాయం పొందవచ్చని, ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్, మరియు రాయితీలు అందిస్తుందని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు ఈనెల 19వ తేదీన వినుకొండ మార్కెట్ యార్డులో మెగా కిసాన్ మేళ జరుగుతుందని, ఆధునిక వ్యవసాయం- ఆర్థిక ప్రగతి అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు జరుగుతుందని, రైతుల అవగాహన పెంపొందించేందుకు ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి సైంటిస్టులు హాజరై సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మెగా కిసాన్ మేళాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గంలో రైతులు వేలాదిగా తరలివచ్చి లాభసాటి వ్యవసాయం పై శాస్త్రవేత్తలు చేసే సూచనలు, సలహాలు పాటించి పండ్ల తోటల సాగుపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. 19న జరిగే మెగా కిసాన్ మేళ సభా ప్రాంగణ స్థలాన్ని మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరిశీలించి ఏర్పాట్లు తడితిగతన పూర్తి చేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, ప్రజా ప్రతినిధులు, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు (Story:14 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయించాలి..)

