తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై సందిగ్థత తొలగినట్లే అన్పిస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం కీలకనిర్ణయం తీసుకున్నది. ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌రెడ్డి పేరునే సూచించారు. సీఎం పదవికి భట్టి విక్రమార్కతోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి తదితరులు ప్రయత్నించినప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం ఏకగ్రీవంగా రేవంత్‌రెడ్డికే మొగ్గుచూపింది. అసలు తెలంగాణలో కాంగ్రెస్సే రాదని అనుకుంటున్న తరుణంలో రేవంత్‌రెడ్డి ఆ పార్టీని ఏకంగా గద్దెపై కూర్చోబెట్టారు. పైగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను గట్టిగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఒక్క రేవంత్‌రెడ్డికే వుందని కూడా కార్యకర్తలు నమ్ముతూవచ్చారు. మూడేళ్ల క్రితం పీసీసీ అధ్యక్షపదవిని చేపట్టిన నాటినుంచి రేవంత్‌రెడ్డి పార్టీ స్వరూపాన్నే మార్చేశారు. బీఆర్ఎస్ నేతలకు దీటుగా సమాధానాలు ఇస్తూ ప్రజలను ఆకట్టకున్నారు. భారత్‌జోడో యాత్రలో తన వైఖరిని స్పష్టం చేస్తూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే రేవంత్ మార్చేశాడు.
7 గంటలకు ప్రమాణ స్వీకారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణం చేయిస్తారు. అయితే ఆయన ఒక్కరే ప్రమాణం చేస్తారా? లేదా మంత్రివర్గం కూడా ప్రమాణం చేస్తుందా అన్నది ఇంకా తేలలేదు. కాకపోతే మంత్రివర్గం కూర్పుకు అధిష్ఠానం అనుమతి అవసరమైనందున ప్రస్తుతానికి రేవంత్ ఒక్కరే ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఉదయాన్నే కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. రేవంత్ తోపాటు డీకే శివకుమార్, థాక్రే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు గవర్నర్‌ను కలిసిన వారిలో వున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు రాగా, బీఆర్ఎస్‌కు 39 స్థానాలు లభించాయి. బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి 1 స్థానం లభించింది. (Story: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి)
See Also