ప్రతి గడపకూ ప్రభుత్వ సాయం అందిస్తా
– వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తోడుగా ఉంటాం
– ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం అందించిన మంత్రి
– వరద నీటిలో ట్రాక్టర్‌పై వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు
– ఐఏఎస్‌లు, సీనియర్ నాయకులు, సచివాలయ సిబ్బందితో సహాయం
– ఈ రోజు నుండే ఆరు రకాల రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నాం
– బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు త్వరితగతిన జరుగుతున్నాయి
– నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు ప్రారంభించాం
– కేంద్ర మంత్రి కూడా రైతుల విషయంలో ఉదారంగా ఉంటామన్నారు
– అంబాపురంలో వరద బాధితులకు మంత్రి కొల్లు రవీంద్ర భరోసా
న్యూస్‌తెలుగు/ విజయవాడ : వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో లేకుండా చూసుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాపురం వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పర్యటించారు. కృష్ణా నది, బుడమేరు కాలువ, పాముల కాలువకు వచ్చిన వరద మొత్తం బుడమేరుకు చేరడంతోనే అంబాపురం, జక్కంపూడి, సింగ్ నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆరు రోజులుగా కలెక్టరేట్లోనే ఉంటూ, అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి బాధితుడికి అండగా నిలవాలనే లక్ష్యంతో కదులుతున్నారు.
బుడమేరు కాలువపై విజయవాడ వైపుగా మూడు గండ్లు పడ్డాయి. వాటిలో ఇప్పటికే రెండు పూడ్చేశాం. ఆర్మీ సహాయంతో మూడో గండిని పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి.నీటి మట్టం రాత్రి నుండి పెరిగినా పూడ్చివేత పనులు ఆగడం లేదు. గత పాలకుల తప్పిదాలకు విజయవాడ నగరం అతలాకుతలమైపోయిందన్నది అక్షర సత్యం. బుడమేరును బాగు చేయకపోగా కట్టల్ని తవ్వుకుని ఆ మట్టిని అమ్ముకున్నారు. కట్టలను బలోపేతం చేయాలనే ఆలోచన చేయకుండా ఈ రోజు వచ్చి షో చేయడం సిగ్గుచేటు. గతంలో బుడమేరు వరదను కృష్ణలో కలిపేందుకు ప్రణాళికలు రచించి, పనులు చేస్తే.. జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆ పనుల్ని గాలికి వదిలేశాడు. ఇప్పుడొచ్చి హడావుడి చేస్తున్నాడు.
ఆహారం, మందులు, తాగునీటిని యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేశాం. బాధిత ప్రజలందరికీ అందిస్తున్నాం. ఈ రోజు నుండి 25 కిలోల బియ్యం, కందిపప్పు, వంటనూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాలాదుంపలు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నాం.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఛౌహాన్ ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రైతులందరికీ కేంద్రం నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా వరి, పసుపు, కంద, అరటి లాంటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించాం. నష్టపోయిన పంట వివరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో బుడమేరు కాలువ వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారు.
చంద్రబాబు వారం రోజులుగా కలెక్టరేట్లో ఉంటూ సహాయక కార్యక్రమాలు పర్యవేక్సిస్తుటే.. జగన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు నీచమైన విమర్శలకు తెరలేపారు. వరద బాధితుల విషయంలో స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు ఉదారంగా ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లలు కూడా తమ కిడ్డీ బ్యాంకులోని డబ్బు తీసుకొచ్చి విరాళంగా అందిస్తున్నారు. కానీ, వైసీపీ నాయకులు పేదలకు పాల ప్యాకెట్టు కూడా పంచింది లేదు. విమర్శలు చేయడం తప్ప.. విరాళాల విషయంలో ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.
వరద బాధితుల వివరాలన్నీ సమగ్రంగా సేకరిస్తున్నాం. ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలచొప్పున చెక్కులు అందించాం. మూడు డివిజన్లకు ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ నాయకుడు, సచివాలయ సిబ్బంది, ఇతర కార్యకర్తల్ని రంగంలోకి దించాం. ఇంటింటికీ ఆహారం అందించడం నుండి.. జరిగిన నష్టం వివరాలు సేకరిస్తున్నాం. విద్యుత్ లైన్లను 90శాతానిక పైగా పునరుద్దరించాం. వందలాది వాటర్ ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ బెడ్స్ క్లీన్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చాం. ఫైరింజన్లు పెట్టి వీధులు, ఇళ్లను క్లీన్ చేస్తున్నాం.
విపత్తుల్ని ఆపలేం. కానీ నష్టాన్ని నివారించొచ్చన్నది చంద్రబాబు నాయుడు ప్రణాళిక. ఆ మేరకు ముందుకు వెళ్లాం. బ్యాంకర్లు, ఇన్సూరెన్స కంపెనీల సిబ్బందితో సమావేశమై బాధితులను వేధించొద్దని సూచించాం. చంద్రబాబు పనితీరు, చొరవ చూసిన ప్రజలు.. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం అదృష్టమని భావిస్తున్నారు. హుధూద్, తిత్లీ లాంటి తుపాన్ల సమయంలో కనీసం కన్నెత్తి చూడని జగన్ రెడ్డి.. ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 10వేల క్యూసెక్కుల సామర్ధ్యం కూడా లేని బుడమేరుకు 30 వేల క్యూసెక్కులకు పైగా వరదొచ్చింది. కృష్ణా నది చరిత్రలోనే అత్యధికంగా 11.40 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్ని కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. సహాయం చేయడానికి ముందుకు రాకపోగా.. బురద రాజకీయాలు చేస్తే.. ప్రజలు మీ మొహాన బురద కొట్టడం తథ్యం. (Story : ప్రతి గడపకూ ప్రభుత్వ సాయం అందిస్తా)