ఊసరవెల్లి మోడీ …స్వప్రయోజనాలే బీజేపీ పార్టీ ఎజెండా
జిల్లా మహాసభలను ప్రారభం చేసిన జేవీ సత్యనారాయణ మూర్తి
ప్రజా పోరాటాలు ద్వారానే పార్టీ బలోపేతం
అక్కినేని వనజ
కార్మిక వర్గ పార్టీని నిర్మించండి
రావులపల్లి రవీంద్రనాథ్
న్యూస్ తెలుగు/ చింతూరు : భారత కమ్యూనిస్టు పార్టీ తూర్పుగోదావరి జిల్లా 26వ మహా సభలలో భాగంగా గురువారం స్థానిక ముళ్ల పూడి ప్రాంగణం ఆనం రోటరీ హాలులో ప్రతినిధుల సభ జరిగింది. జిల్లాలోని వివిధ మండలాలు, నియోజక వర్గ కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశానికి తొలుత సిపిఐ సీనియర్ నాయకురాలు యడ్ల లక్ష్మి పార్టీ జెండాను ఎగురువేయగా, సిపిఐ అమరవీరుల స్థూపానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి గౌరవ వందనం చేశారు.ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా కుండ్రపు రాంబాబు, పి లావణ్య, పంతం నాగేశ్వరావు ఉన్నారు ముందుగా అమరవీరులకు మహాసభ నివాళులు అర్పించారు.ముందుగా పార్టీ పతకాన్ని ఎగరవేసిన సిపిఐ సీనియర్ నాయకురాలు యడ్ల లక్ష్మి మాట్లాడుతూ, తాను తన పదహారవ ఏటనే పార్టీలోకి వచ్చి వివిధ ఉద్యమాలలో పాల్గొన్నానని, తనను గుర్తించి తనకు అనేక పదవులు ఇచ్చిన పార్టీ సిపిఐ అని అన్నారు. అలాగే పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలకు నివాళులర్పించే మంచి సంప్రదాయం ఈ పార్టీకి ఉండడం వల్లనే ఇప్పటికీ తాను పార్టీలోనే కొనసాగుతున్నానన్నారు. త్యాగాలకు ప్రతిరూపం కమ్యూనిస్టు పార్టీ అని, ఆ పార్టీకోసం పని చేయడం వల్ల తన జన్మ తరించిందన్నారు.విశిష్ట అతిధిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, నేడు దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం ధర్మాన్ని పాటించకుండా వారి సొంత ఎజెండాను యధాతథంగా అమలు చేస్తోందన్నారు. మతాల ప్రాతిపదికగా దేశాన్ని విభజించి పాలిస్తున్నారన్నారు. నాగాలాండ్ లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండడం వల్ల ముస్తింలకు ఎక్కువ రాయితీలు ఇస్తామంటున్నారని, అలాగే మిజోరాం ఎన్నికలకు సంబందించి వారి ఆహారపు అలవాట్ల మీద ఎలాంటి ఆంక్షలు విధించమని అంటున్నారన్నారు. గోవధ జరుగుతుండడం వల్ల ముస్లిం, క్రిస్టియన్లు, దళితుల మీద దాడులు చేస్తున్న మోడీ ప్రభుత్వం, నేడు ఏ ఎజెండాతో మిజోరాంలో బీఫ్‌ను ఆహారంగా చేస్తామంటున్నారని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం బయటికి ఒక విధంగా లోపల మరో విధంగా ఊసరవెల్లిలా ప్రవర్తిస్తుందని, తమ స్వప్రయోజనాల కోసం ఎలాంటి దిగజారుడు పనికైనా మోడీ ప్రభుత్వం సిద్ధ పడుతుందని ఎద్దేవా చేశారు. అలాగే, ఛత్తీస్ గడ్ లో మత మార్పిడికి సహకరిస్తున్నారన్న కారణంగా కేరళకు చెందిన ఇద్దరు సన్యాసిలను అరెస్టు చేసి జైలుకి పంపించారని, తిరిగి వారు కోర్టుకు అప్పీల్ చేస్తే బెయిల్ వచ్చీ రావడంతోనే సాక్షాత్తు బిజెపి కేరళ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళిద్దర్నీ నేరుగా కారులో ఎక్కించుకుని వెళ్ళడం ఎంత వరకు సబబని అన్నారు. బిజెపి ప్రభుత్వం మతం కన్నా వారి స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నేడు దేశ వ్యాప్తంగా మహిళల మీద విపరీతంగా దాడులు పెరిగిపోతున్నాయని, ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి మీద సామూహిక అత్యాచారం చేసి దహనం చేశారని, అలా చేసిన వారిలో ఎక్కువ మంది బిజెపికి చెందిన వారు ఉండడం గమనార్హమన్నారు. అలాగే అనేక అకృత్యాలు , హత్యలు చేసిన డేరా బాబాకు బెయిల్ మంజూరు చేయడం కూడా శోచనీయమన్నారు. మతం పేరుతో , ఓట్ల పేరుతో బిజెపి అనేక అరాచక విధానాలకు పాల్పడుతున్న బిజెపి తీరును అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో చిన్నచిన్ననేరాలు చేసిన వేలాది మంది జైళ్ళల్లో మగ్గిపోతున్నారన్నారని ఇది చాలా విచారకరమన్నారు. మోడీ ప్రభుత్వం ఘోరంగా ఉందని, పెహల్గాంను అడ్డుపెట్టుకుని హిందూ , ముస్తింల మధ్య విభేదాలు సృష్టించిందని, మరో వైపు మావోయిస్టులను లేకుండా చేస్తామని మొదలు పెట్టిన ఆపరేషన్ కగార్ దండకారణ్యంలోని ఆదివాసీ జీవితాలను ప్రమాదంలోకి నెట్టిందన్నారు. విలువైన ఖనిజాలకు నిలయమైన దండకారణ్యాన్ని , ఆదివాసుల నివాస ప్రాంతాలను కార్పోరేట్ శక్తులకు అప్పగించాలంటే అక్కడున్న ఆదివాసీలను తరిమి వేయడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్న కేంద్రం అందుకోసం మావోయిస్టు సమస్యను బూచీగా చూపుతోందన్నారు. మావోయిస్టుల పేరుతో తమ హక్కుల కోసం గళమెత్తుతున్న ఆదివాసీలను ఎన్ కౌంటర్ చేస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 90 శాతం మంది అమాయక గిరిజనులేనన్నారు. గిరిజనులు ఒక చెట్టు కొడితేనే వారి మీద కేసులు పెట్టే మోడీ ప్రభుత్వం నేడు ఛత్తీస్ ఘడ్ లో వేలాది ఎకరాలు అదానికి కట్టబెడుతుందని విమర్శించారు. నేడు మోడీ ప్రభుత్వం భయపడుతోందని, ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రం విషయానికొస్తే, తాము అధికారంలోకి వస్తే పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్ల భూమి ఇస్తామని ప్రకటించి ఓట్లు దండుకుని గెలిచిన బాబు ప్రభుత్వం ప్రజల ఇళ్ళ స్థలాల విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు సమస్యలు తెలుసుకున్న సిపిఐ పార్టీ ప్రజల తరుపున ఇళ్ల స్థలాల దరఖాస్తులు పెట్టిస్తే దానిని అడ్డుకుంటున్నారన్నారు. ప్రజా హక్కుల్ని కాలరాయడంలో బాబు సిద్ధహస్తుడని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తాము చూస్తూ ఊరుకోమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మండల , నియోజక వర్గ స్థాయి కార్యకర్తలుచిత్తశుద్ధితో కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే దిశలో పని చేయాలన్నారు. ప్రజల హక్కుల్ని కాలరాయడానికి బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఈ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా పని చేయడానికి జిల్లా నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ అక్కినేని వనజ మాట్లాడుతూ , నేడు సిపిఐ పార్టీ అనేక సమస్యల మీద పోరాటం చేస్తుందని, రాజారామ్ మోహన్ రాయ్, వీరేశలింగం లాంటి మహనీయులకు పార్టీ స్ఫూర్తినిచ్చి వారిని ఉద్యమం వైపు నడిపించిందన్నారు. అలాగే, కవుల్ని, కళాకారులను సృష్టించిన పార్టీ సిపిఐ పార్టీ అని , సమస్యలకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ సిపిఐ అని ఆమె అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలు లేకుండా చట్టాలు కాని, సంక్షేమాలు కానీ సాధించబడలేదని, ఉపాధి హామీ పధకం, సమాచార హక్కు చట్టం తీసుకురావడానికి పార్టీయే కారణమన్నారు. నేడు పార్టీ బలహీన పడిందని, బలహీన పడిన ఈ పార్టీని తిరిగి బలంగా మార్చుకోవలసిన అవసరం ప్రతీ కార్యకర్త మీద ఉందన్నారు.నేడు దేశంలో ఎల్ ఐసి, బిఎస్ ఎన్ ఎల్ లాంటి సంస్థలు ప్రయివేటు పరం అవుతున్నాయని , దేశంలో రక్షణ వ్యవస్థ దారుణంగా ఉందని చెప్పడానికి పెహల్గాం సంఘటనే ఉదాహరణ అని ఆమె అన్నారు. నేడు ప్రతీ పౌరుడి మీద అప్పు ఉందని చెబుతున్న ప్రభుత్వం, నేడు అప్పులను తిరిగి సామాన్యుడి మీదే వేస్తుందని విమర్శించారు. పేద వాడి దగ్గర దోచుకుని కొంత మంది ధనవంతుల జేబులు నింపుతుందన్నారు. బడా బాబులు తీసుకున్న 11 లక్షల కోట్ల రూపాయల రుణాలను కేంద్రం మాఫీ చేసిందని, ఎవరిని ఉద్దరించడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మాఫీ చేశారన్నారు. ఇలాంటి ఆర్ధిక వ్యత్యాసాలు మారాలని, అందరికీ సమాన హక్కులుండాలన్నారు. దీని కోసం సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు ప్రజల పక్షాన లేవని, నాలుగున్నర లక్షల చెట్లు నరికేస్తున్నారని, ఇక పర్యావరణ సమతుల్యత ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. అలాగే ఈ దేశంలో 90 శాతం పత్రికలు అంబాని, అదాని చేత్తుల్లో ఉన్నాయని, ప్రభుత్వం ఎప్పుడూ మత విద్వేషాలు
రెచ్చకూడదన్నారు. మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని, ధర్మస్థలిలో 1980ననుంచి అనేక అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆ విషయాలు బయటకు వెళ్ళడించకూడదని ట్రస్టు కోర్టుకు వెళ్ళడం విచారకరమన్నారు. అయితే దీనిని హైకోర్టు కొట్టివేయడంతో తిరిగి ధర్మస్థలి విషయాలు అందరికి తెలిసాయన్నారు. సంఘ పరివార శక్తుల్ని, బిజెపిని ఎదుర్కొనే శక్తి ప్రస్తుతం సిపిఐ కి సరిపోదని, అందువల్ల సిపిఐ శక్తిని పెంచుకోవడానికి ప్రజాస్వామ్యవాదులు, సెక్యులర్ శక్తులు ముందుకు వచ్చి ఆయా శక్తులను నిలువరించాలన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ పార్టీ బలపడాలంటే ప్రతీ కార్యకర్త జనంతో ఉండాలని, అలాంటపుడే పార్టీ నిలబడుతుందన్నారు. అలా చేయాలంటే కమిటీలు, శాఖలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజల్లో పనిచేసే సత్తా సిపిఐ పార్టీకే ఉంటుందని, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. పార్టీ నిధిని కూడా పెంచుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. జట్ల సంఘాలు అన్ని చోట్ల పార్టీని బలోపేతం చేయాలన్నారు. దీనికి గ్రామ శాఖ స్థాయి నుంచి జిల్లా శాఖ వరకు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యకలాపాల నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రేఖా భాస్కరరావు, సిపిఐ నగర కార్యదర్శి వి. కొండల రావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. జ్యోతిరాజు, జట్ల సంఘం కార్యదర్శి సప్ప రమణ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్, ఏఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ . సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. త్రిమూర్తులు, ప్రజా నాట్యమండలి నగర కార్యదర్శి సిడగం నౌరోజి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రెడ్డి రమణ ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు కె.రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గమ్మ, ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు శ్యామ్, మడకల రమణ ఎం.కుమార్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఊసరవెల్లి మోడీ …స్వప్రయోజనాలే బీజేపీ పార్టీ ఎజెండా )

