Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బిడ్డకు తల్లి పాలు శ్రేష్టం

బిడ్డకు తల్లి పాలు శ్రేష్టం

బిడ్డకు తల్లి పాలు శ్రేష్టం

నార్మల్ డెలివరీలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

న్యూస్ తెలుగు/సాలూరు : బిడ్డ పుట్టిన గంట లోపు తల్లి పాలు పట్టడం వలన బిడ్డ ఆరోగ్యం బాగుంటుందని,తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమైనవి, అనేక పోషకాలతో పాటు విటమిన్లు ఉంటాయని, వీటివల్ల బిడ్డకు వ్యాధుల నుండి వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు భోజనం చేసిన తరువాత నడవడం, చిన్న చిన్న పనులు చేయడం వల్ల సుఖ ప్రసవం అవుతుందని అన్నారు. శరీరక శ్రమ లేకపోతే బరువు పెరిగి డెలివరీ కష్టమవుతుందని పేర్కొన్నారు. అలాగే పుట్టిన బిడ్డకు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో బిడ్డకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకూడదనుకుంటే ప్రతి తల్లి తమ బిడ్డకు పుట్టిన గంటలో పాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలు బిడ్డకు అందించే మొట్టమొదటి పౌష్టికాహారమని, బిడ్డకు తల్లి పాలు పట్టడంతో తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వారి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. బిడ్డకు పాలు ఇవ్వకపోతే పాలు గడ్డకట్టి బాలింతలు ఇబ్బందులు పడతారని అందువల్ల బిడ్డకు తప్పనిసరిగా తల్లి పాలు ఇవ్వాలని అన్నారు. డెలివరీ తరువాత తల్లిలో మొదటగా ఊరేవి ముర్రుపాలని, వీటిని బిడ్డకు తప్పకుండా తాగించాలన్నారు. వీటిలో శక్తివంతమైన యాంటీబాడీలు ఉంటాయని, ఇవి బిడ్డలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయని మంత్రి తెలిపారు. వీటిలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉంటుందని ముర్రుపాలు బిడ్డకు మొదటి వ్యాధినిరోధక టీకాగా పని చేస్తుందన్నారు. తల్లి పాల వల్ల పసికందులో జ్ఞాపకశక్తి పెరుగుతుందని మెదడు చురుకుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు ఆరు నెలలపాటు కచ్చితంగా ప్రతిరోజూ 12 సార్లు తల్లిపాలు తాగించాలని సూచించారు. పాలిచ్చే తల్లి అధికంగా నీరు తీసుకోవడం వల్ల, పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయన్నారు. పండ్లు, డ్రైప్రూట్స్‌, బీన్స్‌ అధికంగా తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో చదువుతున్న పిల్లలకు టీచర్లు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి వివరించాలని కోరారు. అలాగే ప్రతీ వార్డులోని ఇంటింటికి వెళ్లి పిల్లలు, తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కలిపించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని, బిడ్డకు పాలు పట్టడం వల్ల బిడ్డకు ఆరోగ్యం, తల్లి బరువు తగ్గడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా నార్మల్ డెలివరీల్లో మొదటి స్థానం ఉన్నామని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా అభినందించారని తెలిపారు. ప్రతీ గర్భిణీ స్త్రీ నార్మల్ డెలివరీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విశాఖపట్నం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి.చిన్మయ దేవి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టడంలో ఆలస్యం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ద్వారా వెల్లడించిందని అన్నారు. ఆసుపత్రులలో ప్రసవం అయిన తల్లులు సుమారు 44.4 శాతం మాత్రమే పుట్టిన గంటలో బిడ్డకు పాలు పట్టడం జరుగుతోందని వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు బిడ్డకు ఔషదమని తెలిపారు.

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి డా:టి.కనక దుర్గ మాట్లాడుతూ టెక్నాలజీ ఎంత పెరిగినా తల్లి పాల విశిష్టతను ఎవరు మర్చిపోకూడదన్నారు. తల్లి పాల నిల్వలకు కాకినాడ, తిరుపతి,అనంతపురంలలో బ్యాంక్ లు కూడా ఉన్నాయని అన్నారు. పాలు రాని తల్లులు అక్కడ నుండి తీసుకువెళ్లి వాళ్ళ బిడ్డలకు పట్టవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు మంత్రి చేతుల మీదుగా నిర్వహించారు.
విజయ వాహిని సేవా ట్రస్ట్ మరియు టాటా ట్రస్ట్ సహకారంతో హెల్దీ బేబీ, ఉత్తమ కుటుంబం పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి తల్లి పాల అవగాహనపై గోడ పత్రిక ఆవిష్కరించారు.

సాలూరు అర్బన్ డెంకాన వీధిలో ఉన్న ఐసిడియస్ అర్బన్ సెంటర్ కు మంత్రి చేతుల మీదుగా టీవీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్: శివ కుమార్, టాటా ట్రస్ట్ సభ్యులు సుబ్రమణ్యం, సిడిపిఓ విజయ గౌరి,జిల్లా బాలల సంరక్షణ అధికారి సత్యనారాయణ, జిల్లాలో ఉన్న సిడిపిఓలు,మహిళలు, గర్భిణీ స్త్రీలు, ప్రతినిధులు పాల్గొన్నారు.(Story :బిడ్డకు తల్లి పాలు శ్రేష్టం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!