దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సిపిఐ ది కీలక పాత్ర
విజయ రాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సిపిఐ కీలక భూమిక పోషించిందని, పుట్టి 100వ ఏడాదిలో అడుగుపెట్టిన నేపథ్యంలో చరిత్రను గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు పిలుపునిచ్చారు. గురువారం వనపర్తి పట్టణం సిపిఐ కార్యాలయంలో సిపిఐ 100వ ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆఫీసు వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు, పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లాకార్యవర్గ సభ్యులు శ్రీరామ్, గోపాలకృష్ణ, శ్రీహరి మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని పిలుపునిచ్చింది సిపిఐ మాత్రమేనన్నారు. సిపిఐ ని లేకుండాచేయాలని సిపిఐ పై మూడు కుట్ర కేసులు పెట్టారని, వాటిని ఛేదించుకొని ప్రజల పక్షాన అలుపెరుగని ఉద్యమాలు నడిపిందన్నారు. కార్మికులు కర్షకులు బడుగు బలహీన మైనార్టీ వర్గాల హక్కుల కోసం ఉద్యమాలు నడిపిందన్నారు. దేశంలో సిపిఐ పాల్గొనని ఉద్యమాలు లేవన్నారు. తెలంగాణ ప్రాంతంలో సిపిఐ సాగించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖిత దిగిందన్నారు. నిజాం సర్కార్ మెడలు వంచేందుకు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి నుంచి ప్రజల విముక్తి కోసం పోరాటం నడిపిందన్నారు. పేదలకు పది లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐ సొంతమన్నారు. ఈ ఉద్యమంలో4500 మంది సిపిఐ నేతలు, కార్యకర్తలు అమరులయ్యారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సిపిఐ మడమ తిప్పని పోరాటం చేసిందని, ప్రత్యేక రాష్ట్రం కావాలని జాతీయ పార్టీ తీర్మానం చేసిందన్నారు. సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ 26 కు 100 వ ఏడులోకి అడుగుపెట్టిందన్నారు. వనపర్తిజిల్లాలో పార్టీ ఉన్న, లేని గ్రామాల్లో సిపిఐ పోరాటాల చరిత్రను వచ్చేడిసెంబర్ 26 వరకు ఏడాది పాటు విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు. నల్లగొండలోఈ డిసెంబర్ 30వ తేదీన 100వ సంవత్సరం సందర్భంగా భారీ బహిరంగ సభ జరుగుతుందని పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజా కవి జనజ్వాల, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, చంద్రయ్య, రవీందర్, గోపాలకృష్ణ, శ్రీహరి, ఎత్తం మహేష్, శివ, భూమిక, శిరీష చిన్న కురుమయ్య, శాంతయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు. (Story : దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సిపిఐ ది కీలక పాత్ర)