ప్రజావాణి లో ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 40 అర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. (Story : ప్రజావాణి లో ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలి)