కొత్త మంత్రివర్గం – ఒక పరిశీలన
1. రెండున్నర ఏళ్ల తర్వాత తన మంత్రివర్గంలోని 90% మందిని తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో చేసిన ప్రకటన గడువు ముగియడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అజెండా తెరపైకి వచ్చి, నేడు ఆ తంతు పూర్తయ్యింది.
2. జగన్మోహన్ రెడ్డి గారు నాడు చెప్పినట్లు 90% మంత్రులను కాకుండా 55% మందిని తొలగించారు. గౌతం రెడ్డి గారి మరణంతో 25 మంది ఉన్న మంత్రివర్గంలో ముఖ్యమంత్రిని మినహాయిస్తే 24. వారిలో 13 మందిని తగ్గించి 14 మందిని కొత్త వారిని తీసుకొన్నారు. పాత వారు ముగ్గురో, నాలుగురో మాత్రమే కొనసాగుతారని మొదలైన ఊహాగానాలు కడకు 11ని కొనసాగించాల్సిన విధిలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడిందని తేలిపోయింది.
3. 26 జిల్లాలలో 8 జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. శ్రీకాకుళం, కడప మినహాయిస్తే ముఖ్యమైన విశాఖ, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర నగరాలు, పట్టణాలకు ప్రాతినిథ్యం

లేదు. అంటే మంత్రివర్గంలో పట్టణ ప్రాంతాలకు ప్రాతినిథ్యం నామమాత్రమే.
4. మంత్రివర్గ కూర్పులో 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కుల సమీకరణల కోణం స్పష్టంగా కనబడుతున్నది. సామాజిక న్యాయానికి పెద్ద పీఠ వేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దానికి కొంత ప్రాతిపదిక ఉన్నది. కానీ, అదే సందర్భంలో మంత్రివర్గంలో మహిళల ప్రాతినిథ్యం కేవలం 15% అని గుర్తించాలి. అలాగే, సంఖ్య రీత్యా పెద్దవిగా ఉన్న కొన్ని సామాజిక తరగతులకు అసలు ప్రాతినిథ్యమే లేదు. అందువల్ల సమతుల్యత లోపించింది.
5. 2019లో అధికారంలోకి వచ్చిన నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకొన్నప్పుడు వై.ఎస్.ఆర్.సి.పి.లో ఎలాంటి అసంతృప్తి వ్యక్తంకాలేదు. దాదాపు మూడేళ్ల పాలన తదనంతరం జరిగిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సందర్భంగా మంత్రి పదవులు కోల్పోయిన, ఆశావహుల మద్దతుదారుల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన జ్వాలలు రోడ్డెక్కాయి. ఈ పరిణామం పార్టీ నాయకుడి పట్టు బలహీనపడిందా! అన్న అనుమానం ప్రజల్లో కలగడానికి అవకాశం ఇచ్చింది.
6. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయాలంటే మంత్రివర్గం ప్రజాస్వామ్యయుతంగా, సమిష్టిగా కృషి చేయాలి. నేడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చేతుల్లో అధికార కేంద్రీకరణ పర్యవసానంగా మంత్రివర్గం యొక్క పని విధానం నిర్వీర్యం చేయబడ్డది. అందుకే, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మంత్రివర్గం పని విధానంలో గుణాత్మకమైన మార్పు ఆశించడం అత్యాశే!