ఘనంగా గీతాంజలి డేస్ స్కాలర్స్ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
స్థానిక కారంపూడి రోడ్ లోని గీతాంజలి గ్రౌండ్స్ నందు డే స్కాలర్స్ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, గుంటూరు జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లిఖార్జున రావు, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర, గ్రంధాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, శ్రీమతి షకీలా బేగం విచ్చేసి చిన్నారులకు సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆంజనేయులు మాట్లాడుతూ. ఈ 25 వసంతాలు విద్యా ప్రయాణంలో గీతాంజలి ఎన్నో మైలురాళ్ళని అధిగమించి ఈ స్థాయికి చేరుకుందని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. తమ పిల్లలు ముగ్గురు ఇదే గీతాంజలి పాఠశాలల్లో విద్యనభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారని, కాబట్టి విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని మంచి స్థానాలకు చేరుకోవాలని కోరారు. మన్నవమో మోహన్ కృష్ణ మాట్లాడుతూ. తనకు విద్యార్థులు అంటే ఎంతో ఇష్టమని వారితో గడపటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని అది కేవలం విద్య వల్లే సాధ్యమైందని కాబట్టి విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలని కోరారు. ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ. గీతాంజలి ఈ స్థాయికి రావడం వెనక కృషి అభినందనీయమని విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి స్థాయికి చేరుకొని తల్లిదండ్రులను సంతోషపెట్టాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గీతాంజలి వ్యవస్థాపకులు శేషగిరిరావు, కరస్పాండెంట్ లక్ష్మణ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.(Story : ఘనంగా గీతాంజలి డేస్ స్కాలర్స్ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు )
