అమరావతి రాజధానిపై జగన్ విషం కక్కడం దుర్మార్గం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతిని సర్వనాశనం చేయడమే పనిగా పెట్టుకుని కుట్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ రాజధానిపై విషం కట్టడం మానక పోవటం దుర్మార్గమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. అమరావతి రాజధానిపై జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చీఫ్ విప్ జీవి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి రెండు నాలుకల సిద్ధాంతాన్ని అనుసరించటం కొత్త ఏమి కాదన్నారు. రాజధానిగా అమరావతి తమకు ఆమోదయోగ్యమని నాడు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ 2019 ఎన్నికల వరకు అదే పాట పాడి గెలిచాక అసలు రూపం బయటపెట్టి మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా విధ్వంసకర విధానాన్ని పారద్రోలేందుకు రాష్ట్ర ప్రజలు కేవలం వైసీపీ 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూలన కూర్చోపెట్టిన వారిలో మార్పు రాలేదన్నారు. అమరావతిని ఘోరమైన దెబ్బతీశానని, మళ్లీ కోలుకోవడం అసాధ్యమని కలలు కన్న జగన్కు కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పట్టాలెక్కించడం మింగుడు పడడం లేదన్నారు. వేల కోట్లతో ఉధృతంగా జరుగుతున్న పనులతో అమరావతి మళ్లీ జీవ కళ సంతరించుకోవడం చూసి జగన్కు కళ్ళు కుట్టాయని అన్నారు. రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి భూ సమీకరణలో భూములు ఇస్తుంటే జగన్ మరోసారి విషయం కక్కుతూ అవాక్కులు,చవాకులు పేల్చడం సరికాదన్నారు. మానవ చరిత్రలో గొప్ప నాగరికతలన్నీ నేటి వనరులు ఉన్నచోట, నదీ తీరాల వెంబటే విలసిల్లాయని, జగన్మోహన్ రెడ్డి పరిజ్ఞానంతో అవగాహన ఉంచుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.(Story : అమరావతి రాజధానిపై జగన్ విషం కక్కడం దుర్మార్గం )

