రైతు ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక ప్రగతికి మూలం
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో రైతుల అభివృద్ధే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయమని, ఇప్పటికే 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉద్యాన పంటలకు ప్రోత్సాహం, డ్రిప్ ఇరిగేషన్‌కు 90% రాయితీతో రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, తన సొంత ఖర్చులతో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం ఆధ్వర్యంలో 56 మందితో కూడిన ఉద్యాన రైతుల విజ్ఞాన యాత్రను నిర్వహించగా, జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. పల్నాడు జిల్లాను హార్టి కల్చర్ హబ్ గా తయారు చేసేందుకు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలంతా రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. పండ్లు, కూరగాయల తోటలకు ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయలు సబ్సిడీతోపాటు, బాగా దిగు బడులు తెచ్చిన రైతుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్లు రైతుల హర్షద్వానాల మధ్య జీవి ప్రకటించారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వినుకొండ లోని 5 మండలాల రైతులు ఉద్యాన రైతు విజ్ఞాన యాత్రకు కోటప్పకొండ ప్రాంతం వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడే రాయలసీమ ప్రాంతం, నేడు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పండ్ల తోటలు, కూరగాయల పంటలతో అక్కడి రైతులు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని, అలాగే పల్నాడు జిల్లా కూడా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తున్నది అన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో వ్యవసాయ రంగం కుంటుబడిందని, వ్యవసాయ పరికరాల నిలిపివేత, సబ్సిడీలు ఎత్తివేత, డ్రిప్ ఇరిగేషన్ మూలన పడటంవల్ల రైతులు ఒకే పంటపై ఆధారపడి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంకూరి రోశయ్య, మాదినేని ఆంజనేయులు, గుంజి కాళింగ రాజు, ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మయ్య, వ్యవసాయ శాఖ ఏడిఏ రవికుమార్, ఏవో వరలక్ష్మి, హార్టికల్చర్ హెచ్.ఓ నబీర్ రసూల్, ఐదు మండలాల ఏఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, హార్టికల్చర్ సిబ్బంది, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : రైతు ఆర్థిక ప్రగతే దేశ ఆర్థిక ప్రగతికి మూలం )
