రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..
– ఉద్యాన పంట సాగుతో రైతు ఆర్థిక ప్రగతి
– సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టి పంటలను కాపాడుకోండి
– ప్రతి ఇంటిపై సోలార్ఖర్ పెట్టండి
– ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో రైతు సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలం బొందిలపాలెం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ నిర్వహించిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ఉచితంగా ఎలుకల నిర్మూలన మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టి పంటలను కాపాడుకోవాలని కోరారు. రైతులకు పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు సకాలంలో అందిస్తూ రైతు సంక్షేమ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రైతులను గాలికి వదిలేసారని, ఎన్డీఏ పాలనలో రైతులు ఆర్థిక ప్రగతి సాధించేందుకు 90% రాయితీపై డ్రిప్ ఇరిగేషన్, మైక్రో న్యూ ట్రేడ్లు, వ్యవసాయ పరికరాలు అందించడమే కాక, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతు అధిక దిగుబడి ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు వరి పంట తో పాటు, సాగునీరు పుష్కలంగా ఉన్న మెరక ప్రాంతాల్లో ఉద్యాన పంటలైన పండ్లు కూరగాయలు సాగు చేసి అధిక ఆదాయంతో ఆర్థిక ప్రగతి సాధించాలని కోరారు. వినుకొండ నియోజకవర్గంలో ఈ ఏడాది 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖల అధికారులు పంట సాగులో మెలకువలు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఇంటిపై (సూర్య ఘర్) సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సోలార్ వలన ప్రతి ఒక్కరికి విద్యుత్ ఖర్చు ఆదావుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని, విద్యుత్తు గ్రిడ్డుకు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ఆయన తెలిపారు. సోలార్ ప్యానల్ ప్రతి ఇంటిపై ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సౌకర్యం కల్పించిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల నాయకులతోపాటు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..)

