మావోయిస్టుపార్టీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథానే కొనసాగిస్తుంది
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
న్యూస్ తెలుగు/ చింతూరు : రాజకీయంగా దిగజారిన ద్రోహులు సోను, సతీష్ లకు తమ పార్టీ పందాలు తప్పుబట్టే హక్కు లేదని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ బంధాన్ని కొనసాగిస్తుందని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ప్రకటనలోభారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న సోను, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సతీష్ లు అవకాశవాదంతో, విచ్ఛిన్నకర వైఖరితో మరి కొందరు కేడర్ లను మోసగించి తీసుకుని వెళ్లి మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు లొంగిపోయారు. రాజకీయంగా దిగజారిన వీరిద్దరూ మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుని, పథకం ప్రకారం లొంగిపోయారు. దాదాపు 3 నెలల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోను లొంగిపోయేందుకు తమతో సంప్రతించారని పత్రికా ముఖంగా ప్రకటించారు. సతీష్ పాత్రికేయుల ద్వారా ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో సంప్రతింపులు జరిపారు. ఈ సంప్రతింపుల మేరకు, కొద్ది కాలం పాటు ఈ ప్రాంతాలలో ఆపరేషన్ లను నిలిపి వేస్తున్నట్టుగా గఢ్ చిరోలి జిల్లా పోలీసు అధికారి బహిరంగంగా ప్రకటించారు. నారాయణపూర్ జిల్లా పోలీసు అధికారి ఆదేశాలు జారీ చేసారు. ఈ రెండు రాష్ట్రాలలో గఢ్ చిరోలి, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల ప్రభుత్వ సాయుధ బలగాలు రక్షణ కల్పించాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఇంద్రావతి నదీ తీరంలో, దాని సమీప ప్రాంతాలలో అక్టోబర్ 13వ తేదీ నుంచి 16వ తేదీన వీరు లొంగిపోయే వరకు పెద్ద ఎత్తున బలగాలను మొహరించాయి. వీరి లొంగుబాటును సుగమం చేసాయి. గడచిన దశాబ్దాల తమ రాజకీయ జీవితాన్ని వీరిద్దరూ ఈ రకంగా వర్గ సామరస్య ధోరణితో, రాజ్యంతో కుమ్మక్కై ముగించుకున్నారు.
భారత రాజ్యానికి లొంగిపోయిన సోను, సతీష్ తమ రాజకీయ దిగజారుడును కప్పి పుచ్చుకునేందుకు పార్టీ పంథాను తప్పు పడుతున్నారు. ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో వచ్చిన మార్పుల కారణంగా దీర్ఘకాలిక ప్రజా యుద్ధ వ్యూహానికి కాలం చెల్లిందని, అందువల్ల సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నామని, బహిరంగంగా ప్రజా పోరాటాలలో పాలు పంచుకుంటామని చెబుతున్నారు. అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అమరుడు కావడానికి ముందు ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు సిద్ధం కావాలని అన్నారని చెబుతున్నారు. ఇది శుద్ధ తప్పు. సోను, సతీష్ లు వాస్తవాలను వక్రీకరించి చెబుతున్న విషయాలివే.
వాస్తవానికి, శాంతి చర్చలకు సంబంధించి సతీష్ అవగాహనలో ఉన్న లోపాలను వివరిస్తూ అమరుడు కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అతనికి ఉత్తరాలు రాసారు. ఈ ఉత్తరాలలో, ఆయుధాలు విడిచిపెట్టడం గురించి పార్టీ ఆలోచించరాదని, అటువంటిదంటూ ఏమన్నా ఉన్నా కూడా అది కేంద్ర కమిటీ మాత్రమే ఆలోచించాల్సిన విషయం అని వివరించారు. ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో ఆయా దేశాలలో తీవ్రమైన నిర్బంధం విరుచుకుపడినప్పుడు విప్లవ పార్టీలు అనేక నష్టాలు చవి చూసాయని, ప్రజలు కష్టాలు, కడగండ్ల పాలయ్యారని గుర్తు చేసారు. చిలీ దేశంలో సాయుధ పోరాటాన్ని విరమించి బహిరంగం అయిన పార్టీ ఎందుకూ కాకుండా పోయిందని రాసారు. కగార్ ఆపరేషన్ లో ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో 2024 ఫిబ్రవరి, ఆగస్టులలో రూపొందించిన ఎత్తుగడలను అమలు చేసేందుకు దృఢంగా పూనుకోవాలని, అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎత్తుగడలు చేపట్టాలని వివరించారు. కాబట్టి ఆయుధాలు విడిచిపెట్టి శాంతి చర్చలకు వెళదామన్నది కామ్రేడ్ నంబాళ్ల కేశవరావ్ అభిప్రాయం కాదు అని స్పష్టంగా తెలియజేస్తున్నామన్నారు.
పరిస్థితులకు తగిన విధంగా తమ్ము తాము ఎదిగించుకోకపోవడం వల్లనే సోను, సతీష్ లు పెడతోవ పట్టారు. వారిలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణపర, వ్యవహారపర లోపాలను పై, తమ, కింది స్థాయి కమిటీల నుంచి వస్తున్న విమర్శలను స్వీకరించి, సరిదిద్దుకోవాలన్న నిజాయితీ కొరవడడంతో నేడు ఈ స్థితికి చేరుకున్నారు. పైగా కేంద్ర కమిటీని దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యునిగా సోను కమిటీలో చర్చ చేయకుండా, కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా నిరాకరించిన తన అభిప్రాయాలను ప్రజలకు అపీల్ పేరుతో బహిరంగం చేయడం అతనిలో రాజకీయ దిగజారుడును, అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. ఎస్ జడ్ సీ స్థాయిలో సతీష్ కేంద్ర కమిటీ అందించిన సైద్ధాంతిక, రాజకీయ అవగాహనను, ఎత్తుగడలను చొరవతో అమలు చేయగలిగితే ఉద్యమానికి ఎంతగానోఉపయోగపడేది. కానీ తన స్వంత అంచనాలతో కొనసాగాడు. ఈ ఇద్దరూ శత్రు నిర్బంధాన్ని అతిగా అంచనా వేసుకున్నారు. సుదీర్ఘ విప్లవ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. తమ అవగాహనా, ఆచరణా లోపాలను కప్పి పుచ్చుకుంటూ కేడర్ లను తప్పు దోవ పట్టించారు. అనేక నష్టాలు పొందడం, ఈ సంవత్సరం కేంద్ర కమిటీ సభ్యులు ఎనిమిది మంది అమరులు కావడం, కగార్ ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటి వరకు 16 మంది రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో డీవీసీ, ఏసీ స్థాయి సభ్యులు, పార్టీ, పీఎల్ జీఏ సభ్యులు, విప్లవ ప్రజానీకం అమరులు కావడంతో, నష్టాలను నివారించుకోలేకపోతున్నామన్న ఆందోళనకు గురి అయిన కొందరు కేడర్ లు సోను, సతీష్ లు పార్టీ పంథాకు భిన్నంగా పెడమార్గంలో చెప్పిన సాయుధ పోరాట విరమణ, బహిరంగ కార్యకలాపాలే మార్గంగా భావించారు. పై స్థాయి కమిటీ సభ్యులుగా సోను, సతీష్ లు చెప్పిన దానిని నమ్మారు. ఇది వారి అవగాహనా లోపం. సుదీర్ఘ కాల రాజకీయ ఆచరణలో నేర్చుకున్న విషయాలను, ప్రజలు వారిపై పెట్టుకున్న ఆశలను మననం చేసుకుని వారంతా పునరాలోచించాల్సిందిగా కోరుతున్నామన్నారు.
దేశంలో పీడిత ప్రజలు, సమూహాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతి కాముకులు, పాత్రికేయులు, ప్రజలూ అందరూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ తమ వంతు కర్తవ్యంగా విప్లవంలో భాగస్వాములుగా కొనసాగుతారని ఆశిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దేశంలో వ్యవసాయ విప్లవం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేసి, ప్రజల రాజ్యాధికారం సాధించి, సమసమాజ స్థాపన దిశగా అంతిమంగా కమ్యూనిజం సాధించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నామని అభయ్ పేర్కొన్నారు.(Story:మావోయిస్టుపార్టీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథానే కొనసాగిస్తుంది)

