వైభవంగా అరుణాచలం నందు కార్తిక పౌర్ణమి వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పరమశివుడు కొలువైనటువంటి అరుణాచలం క్షేత్రం నందు పల్నాడు జిల్లా వాసుల ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అరుణాచలేశ్వర అన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రతినెలా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాలకు చెందిన కొంతమంది భక్తులు ఒక సమూహంగా ఏర్పడి దాతల సహాయ సహకారాలతో గత 25 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పారెళ్ళ మల్లికార్జున్ రావు, ఆరేపల్లి ఏడుకొండలు మాట్లాడుతూ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అన్నదాన సేవా సమాజం ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు అరుణాచల క్షేత్రం నందు వేడుకలు నిర్వహించమన్నారు. మొదటిరోజు వాయు లింగం కు అభిషేకం, రెండవ రోజు లక్ష దీపోత్సవం, అలాగే రాత్రి తెనాలి కు చెందిన పెదపూడి నాగ ప్రవళిక ఆలపాటి ప్రజ్ఞ బృందం వారు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారన్నారు. అనంతరం మూడవ రోజు దాదాపు 5 వేల మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాకు చెందిన దాదాపు 100 మంది భక్తులు అరుణాచాలంకు తరలివెళ్లారు. వీరితో పాటుగా కమిటీ ముఖ్యులు అన్నం నాగా సత్యనారాయణ, బొమ్మిన కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు ఆరేపల్లి వీరాంజనేయులు, లాయర్ శంకర్రావు,కొల్లిపురి వీరంజనేయులు,అరేపల్లి కృష్ణ.బాలకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : వైభవంగా అరుణాచలం నందు కార్తిక పౌర్ణమి వేడుకలు )

