కల్తీ మద్యం పేరు వినిపిస్తే కఠిన చర్యలు
సురక్ష యాప్‌పై అవగాహన కల్పించడాన్ని బాధ్యతగా తీసుకోవాలి
ఎక్సైజ్, స్థానిక యంత్రాంగం, మద్యం దుకాణదారులు, నేతలకు చీఫ్ విప్ జీవీ ఆదేశం
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నమాటే వినిపించకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇకపై కల్తీ మద్యం ఘటనలు ఎక్కడ వినిపించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కల్తీ మద్యం ఘటనలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడానికి కూటమి ప్రభుత్వం సురక్ష మొబైల్ యాప్‌ను తీసుకొచ్చిందని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక ఎక్సైజ్ అధికారులు, అధికార యంత్రాగం, మద్యం దుకాణదారులు, నాయకులందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. అక్రమ మద్యపాన నివారణ కోసం బుధవారం నుంచి ఈ నెల 29 వరకు వారం రోజులపాటు ప్రజా భద్రతా అవగాహన ప్రచారాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ప్రజలందరూ సురక్ష యాప్‌ను ఉపయోగించడం తెలుసుకోవాలని, మద్యం కొనుగోలు చేసే ముందు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అక్రమ, కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టడంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదే సమయంలో మండల స్థాయి నాయకులు కూడా స్థానిక మద్యం దుకాణాలను సందర్శించి ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగం జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌లో తప్పనిసరిగా స్కాన్ చేసి తనిఖీ చేసుకోవాలన్నారు. మద్యం సీసాలపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవడంపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని తెలిపారు. మద్యం దుకాణాలు, బార్లు, ప్రీమియం స్టోర్లు సహా అన్ని లైసెన్స్డ్ ప్రాంగణాల్లో ఏపీఎస్బీసీఎల్ ధ్రువీకృత నాణ్యమైన మద్యం విక్రయాలు మాత్రమే జరిగేలా, నకిలీ మద్యం వస్తే వెంటనే గుర్తించేలా కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను రూపొందించిందన్నారు. కల్తీ మద్యం విక్రయించినట్లు తేలితే.. స్టాక్ స్వాధీనం చేసుకుని మద్యం దుకాణం లేదా బార్‌ను వెంటనే సీజ్ చేసి లైసెన్స్ కూడా రద్దు చేస్తామన్నారు.(Story : కల్తీ మద్యం పేరు వినిపిస్తే కఠిన చర్యలు )
